McAfee: అనుమానాస్పద స్థితిలో మెకాఫే వ్యవస్థాపకుడి మృతి..!

కంప్యూటర్‌ వాడే ప్రతి ఒక్కరికీ తెలిసిన పేరు మెకాఫే. ఈ యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌  వ్యవస్థాపకుడు జాన్‌ మెకాఫే బుధవారం బార్సిలోనాలోని జైలులో కన్ను మూశాడు.

Updated : 24 Jun 2021 16:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కంప్యూటర్‌ వాడే ప్రతి ఒక్కరికీ తెలిసిన పేరు మెకాఫే. ఈ యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌  వ్యవస్థాపకుడు జాన్‌ మెకాఫే బుధవారం బార్సిలోనాలోని జైలులో కన్ను మూశాడు. బ్రయాన్స్‌2 జైలు సిబ్బంది ఆయనకు చికిత్స అందించేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. ఆయనను అమెరికాకు అప్పగించేందుకు స్పెయిన్‌ జాతీయ న్యాయస్థానం అంగీకారం తెలిపిన గంటల వ్యవధిలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఆయనపై అమెరికాలో పలు పన్నుఎగవేత కేసులు నమోదయ్యాయి. ఆయన గతంలో అమెరికా అధ్యక్ష రేసులో ఉండేందుకు ప్రయత్నించి విఫలం అయ్యాడు. 

మెకాఫే జూన్‌ 2020 నుంచి స్పెయిన్‌ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఆస్తులు కూడబెట్టినా, నాలుగేళ్లుగా ఎలాంటి పన్ను చెల్లింపు రిటర్నులు దాఖలు చేయలేదని అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, ఈ ఏడాది మార్చిలో సోషల్‌ మీడియాను వాడుకొని క్రిప్టో కరెన్సీలను ప్రమోట్‌ చేసి మోసం, మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ రకంగా ఏకంగా 13 మిలియన్‌ డాలర్లను అతను పోగు చేసినట్లు ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు.

ఇక సైబర్‌ సెక్యూరిటీ రంగంలో మాత్రం మెకాఫే చెరగని ముద్ర వేశాడు. ఆయన 1987లో కాలిఫోర్నియాలోని శాంటాకార్లాలో మెకాఫే కార్పొరేషన్‌ స్థాపించాడు. పర్సనల్‌ కంప్యూటర్‌ యాంటీవైరస్‌ మార్కెట్‌లో దీనికి తిరుగులేదు. ఫార్చ్యూన్‌ 100 కంపెనీల్లో సగం ఆయన సాఫ్ట్‌వేర్‌నే ఉపయోగించాయి. మెకాఫే కంపెనీ నుంచి 1994లో వైదొలగాడు. కొన్ని దశాబ్దాల తర్వాత ఆయన సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌తో మాట్లాడుతూ ‘‘కంపెనీని నిర్వహించడం ఇక ఏమాత్రం సరదా కాదు.. ఎందుకంటే అది వేలమంది ఉద్యోగులతో భారీగా పెరిగిపోయింది’’ అని పేర్కొన్నాడు. మెకాఫేను 2010లో ఇంటెల్‌ కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఇంటెల్‌ సెక్యూరిటీగా మెకాఫేను రీబ్రాండింగ్‌ చేశారు. 

2008లో మెకాఫే బ్రెజిల్‌కు మకాం మార్చాడు.  అక్కడ ఆయన 100 మిలియన్‌ డాలర్ల సంపద కరిగిపోయి 4 మిలియన్‌ డాలర్లకు చేరింది. రియల్‌ ఎస్టేట్‌, బాండ్స్‌ వంటివి ఆయన్ను నష్టపరచాయి. 2012లో పొరుగింటి వ్యక్తి హత్య కేసులో మెకాఫేపై అనుమానాలు వచ్చాయి. దీంతో గ్వాటేమాలాకు పారిపోయాడు. తర్వాత కొన్ని నెలలకే అక్కడి నుంచి అమెరికాలోని మియామీకి చేరుకొన్నాడు. 2016లో లిబరేషన్‌ పార్టీ తరఫున తాను అధ్యక్ష ఎన్నికల్లో నిలబడతానని ప్రకటించాడు. సైబర్‌ సెక్యూరిటీనే తన అజెండా అని చెప్పాడు. కానీ, పార్టీ నామినేషన్‌ దక్కలేదు. 2017లో బిట్‌కాయిన్‌ వైపు మళ్లాడు. ఎంజీటీ ఇన్వెస్ట్‌మెంట్‌కు సీఈవోగా చేరాడు. ఏడాది తర్వాత అక్కడి నుంచి లక్స్‌కోర్‌ అనే క్రిప్టో కరెన్సీ కంపెనీ సీఈవో అయ్యాడు. 2014-2018 వరకు పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో ఆయన గత అక్టోబరులో స్పెయిన్‌లో అరెస్టు అయ్యాడు. ఆయన జైలులోంచి ట్విటర్‌ మాధ్యమంగా క్రిప్టోకరెన్సీలను ప్రమోట్‌ చేశాడు. కొన్నాళ్లుగా ఆయన మానసిక స్థితిపై అనుమానాలు ఉన్నాయి. ‘తాను అలసిపోయాను’ అనే అర్థం వచ్చేటట్లు చేతిపై పచ్చబొట్టు వేయించుకొన్నాడు. ఈ నేపథ్యంలో ఆయన మరణ వార్త బయటకు వచ్చింది. ఆయన ఆత్మహత్య చేసుకొన్నట్లు ప్రచారం జరుగుతున్నా.. ఇంకా ధ్రువీకరణ కాలేదు.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని