J&J వ్యాక్సిన్‌: 60వేల మందిపై ప్రయోగం!

జాన్సన్‌&జాన్సన్‌ భారీస్థాయిలో మూడో దశ ప్రయోగాలకు సిద్ధమైంది. ఈ చివరి దశలో దాదాపు 60వేల మందిపై ప్రయోగాలు జరిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

Updated : 09 Dec 2021 17:53 IST

కరోనా టీకా భారీ ప్రయోగానికి జాన్సన్‌& జాన్సన్‌ సిద్ధం
సెప్టెంబర్‌ తొలివారంలో ప్రారంభించడానికి సన్నాహాలు

వాషింగ్టన్‌: మానవాళిని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. వీటిలో కొన్ని వ్యాక్సిన్‌లు ఇప్పటికే తొలి, రెండో దశలు పూర్తి చేసుకొని చివరి దశ ప్రయోగాల్లో నిమగ్నమయ్యాయి. ఈ వరుసలోనే జాన్సన్‌&జాన్సన్‌ భారీస్థాయిలో మూడో దశ ప్రయోగాలకు సిద్ధమైంది. చివరి దశలో దాదాపు 60వేల మందిపై ప్రయోగాలు జరిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సెప్టెంబర్‌ తొలివారంలో ప్రారంభమయ్యే ఈ ప్రయోగం అతిపెద్ద క్లినికల్‌ ట్రయల్‌గా మారనుంది.

కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ తయారీలో ఇప్పటికే మోడెర్నా, ఫైజర్‌, ఆస్ట్రాజెనికా వంటి సంస్థలు ముందున్నాయి. అయితే ఇప్పటికే మోడెర్నా, ఫైజర్‌ తయారుచేసిన వ్యాక్సిన్‌ తుదిదశ పరిశోధనలకు 30వేల మంది చొప్పున వాలంటీర్లను నియమించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అయితే, జాన్సన్‌&జాన్సన్‌ సంస్థ జన్‌స్సేన్‌ పేరుతో తయారుచేసిన కొవిడ్‌ వ్యాక్సిన్‌(Ad26.COV2.S)ను మాత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60వేల మందిపై ప్రయోగించనున్నట్లు ఆ సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించారు. అమెరికా, బ్రెజిల్‌, మెక్సికోతోపాటు మరిన్ని దేశాల్లోని దాదాపు 180 ప్రాంతాల్లో ఈ ప్రయోగాలు జరుపనున్నట్లు పేర్కొన్నారు. ఈ మూడోదశ ప్రయోగాల కోసం ఇప్పటికే సరైన ప్రణాళికతోపాటు నియామక ప్రక్రియ చేపట్టినట్లు జాన్సన్‌&జాన్సన్‌ తెలిపింది. 2021 ఆరంభం నాటికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు సంస్థ అంచనా వేసింది. జాన్సన్‌&జాన్సన్‌ వ్యాక్సిన్‌ మూడోదశ ప్రయోగాల కోసం ఇప్పటికే అనుమతి ఇచ్చినట్లు బ్రెజిల్‌ ఆరోగ్య నియంత్రణ సంస్థ ప్రకటించింది. దీంతో బ్రెజిల్‌ ఇప్పటివరకు నాలుగు వ్యాక్సిన్‌ల ప్రయోగాలకు అనుమతి ఇచ్చినట్లయ్యింది.

ఇదిలా ఉంటే, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 160వ్యాక్సిన్లు ప్రయోగదశలో ఉండగా వాటిలో 30వ్యాక్సిన్‌లు మానవ ప్రయోగదశకు చేరుకున్నట్లు సమాచారం. భారత్‌లోనూ వ్యాక్సిన్‌ ప్రయోగాలు ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని