పార్లమెంట్‌లో చొక్కాలు పట్టుకుని కొట్టుకున్న ఎంపీలు..!

పార్లమెంట్‌లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య పరస్పర విమర్శలు.. ప్రభుత్వం తీరును నిరసిస్తూ విపక్షాల ఆందోళనలు తరచూ చూస్తునే ఉంటాం. ఇక సభ్యుల మధ్య

Updated : 29 Dec 2021 11:54 IST

అమన్‌: పార్లమెంట్‌లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య పరస్పర విమర్శలు.. ప్రభుత్వ తీరును నిరసిస్తూ విపక్షాల ఆందోళనలు తరచూ చూస్తునే ఉంటాం. ఇక సభ్యుల మధ్య వాగ్వాదం కూడా సరేసరి. అయితే అదంతా మర్యాదపూర్వకంగా ఉండాలి. కానీ, చట్టసభల హుందాను పెంచాల్సిన ప్రజాప్రతినిధులే విచక్షణ మరిచి ప్రవర్తిస్తే..! జోర్డాన్‌ పార్లమెంట్‌లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ అంశంపై చర్చ సందర్భంగా ఎంపీలు పరస్పర దాడికి దిగారు. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. 

సమానహక్కులపై తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లుపై జోర్డాన్‌ పార్లమెంట్‌లో మంగళవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఓ ప్రతిపక్ష ఎంపీ మాట్లాడుతూ.. ఈ బిల్లు పనికిరానిదంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అధికార పార్టీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఎంపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు సదరు సభ్యుడు నిరాకరించడంతో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

ఇది కాస్తా చినికి చినికి తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఎంపీలు తమ సీట్లలో నుంచి లేచి ఒకరినొకరు తోసుకున్నారు. కొందరు ఎంపీలు చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. ఇదంతా అక్కడి మీడియా ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారమైంది. ఎంపీల బాహాబాహీతో సభ వాయిదా పడింది. అయితే ఈ ఘర్షణల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పార్లమెంటరీ వర్గాలు వెల్లడించాయి. కాగా.. ఎంపీల కొట్లాటకు సంబంధించిన దృశ్యాలను కొందరు మీడియా ప్రతినిధులు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయగా.. ప్రస్తుతం ఈ వీడియోలు వైరలయ్యాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని