Joshimath: ప్రమాదం అంచున జోషీమఠ్‌.. ఇదే పరిస్థితి కొనసాగితే..!

జోషీమఠ్ ప్రాంతంలో భూమి ఏడాదికి దాదాపు 10 సెంటీమీటర్ల మేర కుంగిపోతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ ప్రక్రియ 2018 నుంచి జరుగుతున్నట్లు తెలిపింది.

Published : 19 Jan 2023 17:40 IST

దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని జోషీమఠ్‌ (Joshimath) లో పరిస్థితులు గత కొంతకాలంగా ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం 12 రోజుల వ్యవధిలోనే 5.4 సెంటీమీటర్ల మేర అక్కడి భూమి కుంగిపోయినట్లు ఇస్రో (ISRO) ఇటీవల వెల్లడించింది. దీనికి మరింత బలం చేకూరేలా తాజా నివేదికలు వెల్లడిస్తున్న వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జోషీమఠ్‌లో భూమి కుంగిపోవడం ఇప్పుడు కొత్తేం కాదని, 2018 నుంచి ఏడాదికి దాదాపు 10 సెంటీమీటర్ల మేర భూమి కుంగిపోతోందని ఓ అధ్యయనంలో తేలింది. గ్రీస్‌ దేశంలో అరిస్టాటిల్ యూనివర్సిటీ ఆఫ్‌  థెస్సలోన్కి (ఏయూటీహెచ్‌),  సెంటర్‌ నేషనల్‌ డి లా రీసెర్చ్‌ సైంటిఫిక్‌ యూనివర్సిటీ ఆఫ్‌ స్ట్రాస్‌బర్గ్‌ (సీఎన్‌ఆర్‌ఎస్‌-ఈఓఎస్టీ) సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ మేరకు వెల్లడైంది. గత నాలుగు సంవత్సరాలుగా జోషీమఠ్‌ ప్రాంతంలో భౌగోళికంగా చోటు చేసుకుంటున్న మార్పులను శాస్త్రవేత్తలు ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా పరిశీలించారు. దీని కోసం అధునాతన సాంకేతికతను వినియోగించారు. 

తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో జోషీమఠ్‌ రీజియన్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో జనవరి 2018 నుంచి డిసెంబరు 31,2022 మధ్య ఉపగ్రహ ఛాయాచిత్రాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. పట్టణీకరణలో భాగంగా ఏటవాలు ప్రాంతాలను చదును చేయడం, నీటిపారుదల వ్యవస్థకు ఆటంకం కలిగించడంతో గడిచిన 4 ఏళ్లలో భూగర్భంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని, ఫలితంగా ఉపరితలంపై పగుళ్లు ఏర్పడుతున్నాయని తమ నివేదికలో పేర్కొన్నారు. భూ ఉపరితలంపై చోటు చేసుకుంటున్న మార్పులను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు అధునాతన ఇంటర్‌ఫెరోమెట్రిక్‌ సింథటిక్‌ అపెర్చర్‌ రేడార్‌ (ఐఎన్‌ఎస్‌ఏఆర్‌) విధానాన్ని ఉపయోగించారు. ఒకే ప్రాంతానికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను వాటిని,  మునుపటి ఏడాదిలో అదే సమయంలో భూ ఉపరితలం ఎలా ఉందో సరిపోల్చారు.  ఇలా రెండు చిత్రాల మధ్య తేడాను గుర్తించేందుకు సర్ఫేస్‌ మోషన్‌ మ్యాపింగ్‌ సంకేతికతను ఉపయోగించారు. ఇలా వరుసగా నాలుగేళ్ల చిత్రాలను సేకరించి పరిశోధిస్తే సరాసరిన ఏడాదికి 10 సెంటీమీటర్ల మేర భూమి కుంగిపోతున్నట్లు తేలింది.

గఢ్వాల్‌ హిమాలయ ప్రాంతంలో తొలిసారిగా పగుళ్లు ఏర్పడి తర్వాత.. దీనికి కారణాలు తెలుసుకోమని అప్పటి ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం 1976లో మిశ్రా కమిటీని ఏర్పాటు ఏసింది. దీని ప్రకారం జోషీమఠ్‌ ప్రాంతం ఏటవాలు ప్రాంతంలో ఉందని, అంతేకాకుండా పురాతన శిలలపై నిర్మితమై ఉన్నందున ఇవి కుంగిపోయే ప్రమాదముందని ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. భారీ కట్టడాలకు, బహుళ అంతస్తుల భవనాలకు ఈ నేల సరైనది కాదని అప్పట్లోనే నివేదిక ఇచ్చింది. అయితే ప్రభుత్వాలు మాత్రం ఆ నివేదికను పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా ఏయూటీహెచ్‌, ఈఎన్‌ఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తల బృందం కూడా మిశ్రా కమిటీ నివేదికను సమర్థించింది. సరైన మురుగునీటి వ్యవస్థలు కూడా లేకపోవడం భూ పొరల్లో మార్పులకు కారణమవుతోందని చెప్పింది. వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని లేదంటే తీవ్ర పరిమాణాలు ఎదురయ్యే అవకాశముందని శాస్త్రవేత్తల బృందం హెచ్చరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని