Ramoji Rao: కొత్తదనం, ప్రయోగాలకు రామోజీరావు చిరునామా.. బెంగళూరులో జర్నలిస్టుల ఘన నివాళి

రామోజీరావు తన అంకిత భావం, మేధస్సు, వృత్తి నైపుణ్యంతో సమాజానికి నిలువెత్తు స్ఫూర్తి శిఖరంగా నిలిచారని  బెంగళూరులోని పలువురు జర్నలిస్టులు గుర్తు చేసుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Updated : 16 Jun 2024 20:25 IST

బెంగళూరు: రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మృతికి బెంగళూరులో ఈటీవీ పూర్వ సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. రామోజీరావు తన అంకిత భావం, మేధస్సు, వృత్తి నైపుణ్యంతో సమాజానికి నిలువెత్తు స్ఫూర్తి శిఖరంగా ఎదిగిన తీరును గుర్తు చేసుకున్నారు. బెంగళూరు ప్రెస్ క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన సంతాప సభలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం రామోజీరావుతో అనుబంధాన్ని,ఆయన సాధించిన అసాధారణ విజయాలు, వృత్తి నైపుణ్యానికి ఇచ్చిన ప్రోత్సాహం తదితర అంశాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు నరేంద్ర పుప్పాల్ మాట్లాడుతూ.. దశాబ్ద కాలంగా రామోజీరావుతో సన్నిహితంగా పని చేయడం తనకు ఎంతో ఆనందదాయకమన్నారు. పరిశ్రమ ఒత్తిడిలో ఉన్నా వార్తలను,సంపాదకీయాన్ని, మీడియా సంస్థను విస్మరించలేదన్నారు. రామోజీరావు నిర్మించిన బాటలో తామంతా ప్రయాణించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.

సామాజిక విలువకు రామోజీరావు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారని సీనియర్ జర్నలిస్ట్ శివశంకర్ అన్నారు. వాడే భాషలోనూ స్పష్టత ఉండేదని,ఈటీవీలో వార్త వస్తేనే నిజమనే భావన సమాజంలో నెలకొనేలా చేశారన్నారు. అందుకోసం కొన్ని ప్రకటనల్ని సైతం తిరస్కరించారని గుర్తు చేసుకున్నారు. సామాజిక బాధ్యతను ఏనాడూ విస్మరించలేదన్నారు. సీనియర్ న్యూస్ యాంకర్ రాధికా రాణి మాట్లాడుతూ.. రామోజీరావు ఓ దేవుడిలా తమ అదృష్టానికి తలుపులు తెరిచారన్నారు. ఫిలిం సిటీలో తాము ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకున్నామని.. ఇదంతా ఆయన ఇచ్చిన ప్రోత్సాహం వల్లే సాధ్యమైందని గుర్తు చేసుకున్నారు. కొత్తదనం, ప్రయోగాలకు రామోజీరావు చిరునామాగా నిలిచారు అని సీనియర్ జర్నలిస్టు సమీవుల్లా అన్నారు. సినిమాలు, ఛానల్స్‌ అన్నీ ప్రయోగాలేనని.. అవి నిత్యనూతనంగా ఉంటాయన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ రవిగౌడ్ మాట్లాడుతూ రామోజీరావు ఉద్యోగుల కష్టాలకు అండగా నిలిచారన్నారు. తాను ఈటీవీ భారత్‌లో కాకుండా మరో సంస్థలో చేరినప్పుడు ఆయనను కలిసి ఆ విషయం చెప్పినప్పుడు సంతోషంగా స్వీట్లు ఇచ్చి వెన్ను తట్టారని గుర్తు చేసుకున్నారు. సంస్థ తలుపులు నిత్యం తెరిచి ఉన్నాయంటూ హామీ ఇచ్చారన్నారు. సీనియర్ జర్నలిస్ట్ సోమశేఖర్ కవచూరు మాట్లాడుతూ.. రామోజీరావుకు మీడియాలో విలువలతో పాటు కన్నడపైనా ఎంతో శ్రద్ధ ఉండేదని, మీడియా సంస్థ మొత్తం నాణ్యతలో మొదటిస్థాయిలో ఉండేలా చూసుకున్నారంటూ కొనియాడారు. ఆయన తన ప్రయత్నాలన్నింటిలోనూ విజయం సాధించారన్నారు. ఈటీవీ భారత్‌ సైతం విజయపథంలో దూసుకుపోతుందని చెప్పారు. రామోజీరావు మళ్లీ పుట్టాలని ఆకాంక్షించారు.

రామోజీరావు నుంచి వృత్తిపరమైన నిబద్ధత నేర్చుకున్నామని న్యూస్ ఫస్ట్ హెడ్ రవికుమార్ అన్నారు. న్యూస్ ఛానెల్ నడుపుతున్నప్పుడు ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో ఆయన్ను చూసి నేర్చుకోవాలన్నారు. ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ బైదనమనేని, సీనియర్ పాత్రికేయులు బీవీ శివశంకర్, నాగరాజు ఎస్కే, సదాశివ షెనాయి, ప్రెస్‌క్లబ్‌ ప్రెసిడెంట్ శ్రీధర్, ఈటీవీ మాజీ సహచరులు, కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈటీవీ, ఈనాడు సంస్థల్లో పనిచేసిన వారితో పాటు రామోజీరావు గారితో అనుబంధం ఉన్నవారంతా ఈ కార్యక్రమానికి రావాలని సామాజిక మాధ్యమాల్లో ప్రకటన చేయగా.. పెద్ద ఎత్తున తరలిరావడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు