Jharkhand: ఏనుగు బీభత్సం.. 12 రోజుల్లో 16 మందిని చంపి..!
ఝార్ఖండ్‌లో ఓ ఏనుగు సృష్టిస్తోన్న బీభత్సంతో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అందర్నీ ఒకే ఏనుగు చంపిందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఐదు జిల్లాల పరిధిలోని ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.. పలుచోట్ల సెక్షన్ 144ను విధించారు.
రాంచీ: ఝార్ఖండ్‌లో (Jharkhand) ఐదు జిల్లాల ప్రజలకు ఓ ఏనుగు (Elephant) కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కనిపించిన వారిపై దాడి చేస్తూ ప్రాణాలు తీస్తోంది. ఐదు జిల్లాల పరిధిలో గత 12 రోజుల్లో 16 మందిని పొట్టనపెట్టుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కేవలం ఒక్క రాంచీ జిల్లాలోనే నలుగురిని చంపినట్టు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఈ గజరాజు సృష్టిస్తోన్న బీభత్సంతో ఇట్కీ ప్రాంతంలో అధికారులు 144 సెక్షన్ విధించారు.
‘హజారీబాగ్, రామ్‌గఢ్, ఛత్రా, లోహర్‌దగ్గా, రాంచీ జిల్లాల్లోని ప్రజలు కొన్ని రోజలుగా ఏనుగు భయంతో వణికిపోతున్నారు. ఆ ఏనుగు అకస్మాత్తుగా ప్రజలపై దాడి చేస్తోంది. ఏనుగు దాడుల్లో 12 రోజుల్లో 16మంది ప్రాణాలు కోల్పోయారు. వీరందరినీ ఒకే ఏనుగు చంపిందా? అనే విషయాన్ని నిర్ధారించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేశాం. ఇందుకు సంబంధించిన ఫొటోలనూ విశ్లేషిస్తున్నాం. కమిటీ నివేదిక ప్రకారం త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటాం’ అని అటవీశాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
ఏనుగు దాడులు పెరగడంతో అప్రమత్తమైన అధికారులు.. ఇళ్లనుంచి బయటకు రావద్దని ఇట్కీ గ్రామాల ప్రజలకు సూచించారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రావద్దని.. ఏదైనా ఏనుగు కనిపిస్తే దగ్గరకు వెళ్లవద్దని సూచించారు. కొంతమంది గ్రామ ప్రజలు ఏనుగుకు అతి సమీపంలోకి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి మరణించాడు. అందుకే జనాలు సమూహంగా ఉండకుండా ఉండేందుకు 144 సెక్షన్ విధించాం’ అని రాంచీ అటవీశాఖ అధికారి శ్రీకాంత్ వర్మ వెల్లడించారు.
మరోవైపు ఝార్ఖండ్‌లో ఇటీవల ఏనుగు దాడుల కేసులు ఎక్కువవుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2020-21లో ఏనుగు దాడుల్లో 88 మంది ప్రాణాలు కోల్పోగా.. 2021-22లో ఆ సంఖ్య 133కి పెరిగింది. 2017 నుంచి ఇప్పటివరకు ఝార్ఖండ్‌లో 462 మంది చనిపోయినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Indigo: హైదరాబాద్ నుంచి బయల్దేరిన విమానంలో ప్రయాణికుడి వింత ప్రవర్తన.. ఏం చేశాడంటే?
-
దంపతులను కారుతో ఢీ కొట్టిన నటుడు.. మహిళ మృతి
-
IAF: వాయుసేన హెలికాప్టర్లో సాంకేతిక లోపం.. పొలాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్!
-
KTR: బాల్క సుమన్ మంత్రి అయితే అద్భుతాలు చేస్తారు: కేటీఆర్
-
Turkey: తుర్కియే పార్లమెంట్ వద్ద ఆత్మాహుతి దాడి
-
Anirudh: ఆ సమయంలో నేనెంతో బాధపడ్డా: అనిరుధ్