Rahul Gandhi మేకిన్‌ ఇండియా.. బయ్‌ ఫ్రమ్‌ చైనాగా మారింది: రాహుల్

భారత్‌లోనే వస్తువుల తయారీకి ప్రాధాన్యమంటూ గొప్పలు చెప్పుకునే మోదీ ప్రభుత్వ హయాంలోనే చైనా నుంచి భారీ దిగుమతులు జరిగాయంటూ విమర్శించారు.

Published : 05 Feb 2022 02:20 IST

దిల్లీ: దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. భారత్‌లోనే వస్తువుల తయారీకి ప్రాధాన్యమంటూ గొప్పలు చెప్పుకునే మోదీ ప్రభుత్వ హయాంలోనే చైనా నుంచి భారీ దిగుమతులు జరిగాయంటూ విమర్శించారు. ముఖ్యంగా మేక్‌-ఇన్‌-ఇండియా (Make in India) కార్యక్రమం చైనా-నుంచి-కొనుగోలు (Buy from China) గా తయారవుతోందంటూ ఆరోపించారు. ఎన్నో ఉద్యోగాలను సృష్టించే పలు రంగాలను మోదీ ప్రభుత్వం నాశనం చేస్తోందంటూ రాహుల్‌ గాంధీ దుయ్యబట్టారు.

‘చైనాకు ఉద్యోగాలు.. భారత్‌కు మాత్రం వాగ్ధానం మాత్రమే! ఎన్నో ఉద్యోగాలను కల్పించే మధ్య, చిన్నతరహాతోపాటు అసంఘటిత రంగాన్ని మోదీ ప్రభుత్వం నాశనం చేస్తోంది. ఫలితం.. మేక్‌-ఇన్‌-ఇండియా, బయ్‌-ఫ్రమ్‌-చైనాగా మారుతోంది’ అని రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో ఆరోపించారు. గతంలో ఎన్నడూలేని విధంగా 2021లోనే చైనా నుంచి దిగుమతులు 46 శాతం పెరిగాయని గుర్తుచేశారు. ఈ సందర్భంగా మేక్‌ ఇన్‌ ఇండియాకు సంబంధించి ప్రధాని మోదీ ఇచ్చిన హామీలతో కూడిన ఓ వీడియోను రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఇదే సమస్యపై తాను పార్లమెంటులో లేవనెత్తిన అంశాన్ని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే, పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా లోక్‌సభలో ప్రసంగించిన రాహుల్‌ గాంధీ.. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ సమస్య ఏర్పడిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో 84 శాతం కుటుంబాలు తమ ఆదాయాన్ని కోల్పోయాయన్న ఆయన.. లక్షల మంది నిరుద్యోగులుగా మిగిలారని అన్నారు. అయినప్పటికీ మోదీ ప్రభుత్వం పేదవారి పొట్టకొట్టి ధనికులకు పంచిపెడుతోందని దుయ్యబట్టారు. మరోవైపు భారత్‌ భద్రత తీవ్ర ప్రమాదంతో పడిందన్న రాహుల్‌ గాంధీ.. మన విదేశీ విధానంలో తీవ్ర లోపం కనిపిస్తోందని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని