June Rainfall: జూన్‌లో 20 శాతం తక్కువ వర్షపాతం: IMD

June Rainfall: రుతుపవనాల కదలికలు నెమ్మదించిన నేపథ్యంలో ఈ నెలలో సగటు కంటే తక్కువ వర్షపాతమే నమోదవనుందని వాతావరణ విభాగం అంచనా వేసింది.

Published : 19 Jun 2024 10:10 IST

June Rainfall | దిల్లీ: జూన్‌ 1న రుతుపవనాల ఆగమనం తర్వాత ఈ నెలలో ఇప్పటివరకు 20 శాతం తక్కువ వర్షపాతం (Rainfall) నమోదైనట్లు ‘భారత వాతావరణ విభాగం (IMD)’ వెల్లడించింది. జూన్‌ 12 - 18 మధ్య రుతుపవనాల కదలికల్లో పెద్దగా పురోగతి కనిపించలేదని తెలిపింది. అయితే, రానున్న 3-4 రోజుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, కోస్తాంధ్ర, బిహార్‌, ఝార్ఖండ్‌లలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది.

జూన్‌ 1-18 మధ్య భారత్‌లో 64.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. సాధారణంగా ఈ సమయంలో సగటున 80.6 మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉందని పేర్కొంది. జూన్‌ 1 నుంచి భారత వాయువ్య ప్రాంతంలో 10.2 మి.మీ. (సాధారణం కంటే 70 శాతం తక్కువ), మధ్య భారత్‌లో 50.5 మి.మీ (సాధారణం కంటే 31 శాతం తక్కువ), దక్షిణాదిలో 106.6 మి.మీ (సాధారణం కంటే 16 శాతం అధికం), తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో 146.7 మి.మీ (సాధారణం కంటే 15 శాతం తక్కువ) వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు నికోబార్‌ ప్రాంతంలోకి మే 19న ప్రవేశించాయి. మే 30 నాటికి దక్షిణ, మధ్య భారత్‌లో కొన్ని ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల వరకు విస్తరించాయి. సాధారణం కంటే ఆరు రోజులు ముందుగానే రావడం విశేషం.

జూన్‌ 12 నాటికి కేరళ, కర్ణాటక, గోవా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్‌, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత వాటి కదలికల్లో పెద్దగా పురోగతి కనిపించలేదని ఐఎండీ తెలిపింది. భారత్‌లోని 11 వాతావరణ ఉప విభాగాల పరిధిలో జూన్‌ 1-18 మధ్య సాధారణం, సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. మరో 25 ఉప విభాగాల పరిధిలో తక్కువ నుంచి అతితక్కువ వర్షం కురిసినట్లు తెలిపింది.

మొత్తంగా జూన్‌లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం, అంతకంటే ఎక్కువ; వాయువ్యం, మధ్య భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉండొచ్చని తెలిపింది. దేశంలోని అత్యధిక వర్షాధార వ్యవసాయ ప్రాంతాలను కవర్ చేసే జోన్‌లో ఈ సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. భారతదేశంలో సాగుకు రుతుపవనాలు కీలకం. నికర సాగు విస్తీర్ణంలో 52 శాతం వీటిపైనే ఆధారపడి ఉంది. తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన రిజర్వాయర్లను నింపడానికి కూడా ఇది చాలా కీలకం. జూన్, జులైలను వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైన రుతుపవన నెలలుగా పరిగణిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని