
తప్పుకున్న జడ్జి.. దీదీకి ₹5 లక్షల జరిమానా
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి సువేందు అధికారి ఎన్నికను సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వేసిన పిటిషన్ విచారణ నుంచి కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కౌశిక్ చందా తప్పుకొన్నారు. అయితే న్యాయవ్యవస్థనీ, న్యాయమూర్తినీ కించపరినందుకుగానూ దీదీకి రూ. 5లక్షల జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు.
నందిగ్రామ్ ఎన్నిక ఫలితం ప్రకటనలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ సీఎం మమతా బెనర్జీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సువేందు ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోరారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ కౌశిక్ చందా నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. అయితే భాజపా నేపథ్యం ఉన్న జస్టిస్ కౌశిక్ చందా పిటిషన్ విచారిస్తే తమకు న్యాయం జరగదని, కేసును మరో ధర్మాసనం ముందుకు మార్చవలసిందిగా మమత గత నెల హైకోర్టు చీఫ్ జస్టిస్ కార్యదర్శికి లేఖ రాశారు.
దీదీ అభ్యర్థనపై స్పందించిన జస్టిస్ కౌశిక్ చందా.. నేడు ఆ కేసు విచారణ నుంచి స్వయంగా తప్పుకొన్నారు. ఈ పిటిషన్‌ను వేరే ధర్మాసనానికి బదిలీ చేయాలంటూ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ రాజేశ్ బిందాల్‌కు పంపారు. అయితే ఈ సందర్భంగా సీఎం ఆరోపణలను న్యాయమూర్తి తీవ్రంగా ఖండించారు. ‘‘భాజపా లీగల్ సెల్‌కు నేనెప్పుడూ కన్వీనర్‌గా లేను. కానీ కోల్‌కతా హైకోర్టుకు రాకముందు ఆ పార్టీ తరఫున కొన్ని కేసులు వాదించాను. పిటిషనర్ (మమతా బెనర్జీని ఉద్దేశిస్తూ) కేసులో విచారణ జరపాలని ఎలాంటి వ్యక్తిగత ఉద్దేశం నాకు లేదు. ఆసక్తి అంతకన్నా లేదు. సీజే నాకు అసైన్ చేసిన పిటిషన్లపై విచారణ జరపడం నా రాజ్యాంగ విధి. కానీ, జూన్ 18న నేను విచారణ చేపట్టిన తర్వాత టీఎంసీ నేతలు నా ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇది పూర్తిగా న్యాయమూర్తిని అవమానించేందుకు చేసిన ముందస్తు ప్రణాళికే’’అని జస్టిస్ కౌశిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థను కించపరిచినందుకుగానూ మమతా బెనర్జీకి రూ. 5లక్షల జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత తాను ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కోల్‌కతా హైకోర్టు బెంచ్‌కు రాకముందు భాజపా ప్రభుత్వానికి జస్టిస్ కౌశిక్ చందా అదనపు సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. ఆయనను హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమించడంపై దీదీ గతంలో అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.