IGIA: ఫిర్యాదుల వెల్లువ.. దిల్లీ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి ఆకస్మిక తనిఖీ!

దిల్లీ విమానాశ్రయాన్ని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఎయిర్‌పోర్ట్‌లో రద్దీ, ఇతర సమస్యలపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతోన్న వేళ ఆయన ఇక్కడికి చేరుకున్నారు.

Published : 12 Dec 2022 12:04 IST

దిల్లీ: దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(IGIA)లో తీవ్ర జాప్యం సమస్యపై.. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా(Jyotiraditya Scindia) సోమవారం ఉదయం దిల్లీ ఎయిర్‌పోర్ట్‌ను ఆకస్మికంగా సందర్శించారు. సమస్య తీవ్రంగా ఉన్న మూడో టర్మినల్‌(Terminal 3)లో సీనియర్‌ అధికారులతో కలిసి పరిస్థితులను పరిశీలించారు. రద్దీగా ఉన్న ప్రాంతాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే విమానాశ్రయ సిబ్బందితో మాట్లాడుతూ.. వారికి పలు సూచనలు చేశారు. రద్దీని నివారించేందుకు వీలైనంతవరకు కృషి చేయాలని సూచించారు.

ఇదిలా ఉండగా.. దిల్లీ విమానాశ్రయంలో కొన్నాళ్లుగా తీవ్రమైన రద్దీ నెలకొంది. టెర్మినల్‌ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్‌ లైన్లలో జాప్యం చోటుచేసుకుంటోంది. దీంతో ప్రయాణికులు అన్ని రకాల చెకింగ్‌లు పూర్తిచేసుకొని విమానం ఎక్కడానికి కొన్ని గంటల సమయం పడుతోంది. దిల్లీ ఎయిర్‌ పోర్టులో విస్తరణ పనులు జరుగుతుండటంతో ప్రయాణికులను మూడో టర్మినల్‌ వైపు మళ్లించడం కూడా సమస్యకు కారణమవుతోంది. ఆదివారం సైతం ఎయిర్‌పోర్ట్‌ కిక్కిరిసిపోయింది. దీంతో చాలా మంది ప్రయాణికులు తమ అవస్థలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ట్యాగ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన నేడు విమానాశ్రయాన్ని సందర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని