ఈ నెల 8న కేంద్ర కేబినెట్ విస్తరణ!

కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఇప్పుడో అప్పుడో జరుగుతుందని అనిపిస్తోంది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే..!! కేబినెట్‌ రేసులో ప్రధానంగా వినిపిస్తోన్న జ్యోతిరాదిత్య సింధియా

Updated : 06 Jul 2021 13:56 IST

ఇప్పటికే దిల్లీ బయల్దేరిన సింధియా, సోనోవాల్‌

దిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు మోదీ సర్కారు సిద్ధమైంది. ఈ నెల 8వ తేదీన కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం 10.30 గంటలకు మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు  విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే కేబినెట్‌ రేసులో ప్రధానంగా వినిపిస్తోన్న జ్యోతిరాదిత్య సింధియా సహా పలువురు నేతలు నేడు దిల్లీకి పయనమయ్యారు. అటు కేంద్రమంత్రిగా ఉన్న థావర్‌చంద్‌ గహ్లోత్‌ను నేడు కర్ణాటక గవర్నర్‌గా నియమించారు. దీంతో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్ర కేబినెట్‌లో కొత్తగా 22 మందికి చోటు కల్పించే అవకాశాలు ఉన్నాయి. పలువురు మంత్రుల శాఖల్లోనూ మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. 

సింధియా పూజలు..

భాజపా నేత జ్యోతిరాదిత్య సింధియా ఈ ఉదయం ఇండోర్ నుంచి దిల్లీకి పయనమయ్యారు. బయల్దేరే ముందు ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అటు అస్సాం మాజీ ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్‌ కూడా గువాహటి నుంచి దిల్లీ వెళ్లారు. భాజపా ఎంపీ నారాయణ్‌ రాణె కూడా దేశ రాజధానికి బయల్దేరారు. మరో భాజపా నేత సీపీ సింగ్‌ ఇప్పటికే దిల్లీ చేరుకున్నారు. కేబినెట్‌ రేసులో ఆయన పేరు కూడా వినిపిస్తోంది. అటు జేడీయూ సీనియర్‌ నేతలు లల్లన్‌ సింగ్‌, ఆర్సీపీ సిన్హా ఈ ఉదయమే దిల్లీకి వచ్చినట్లు తెలుస్తోంది.

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ నుంచి భాజపాలో చేరారు. దీంతో మధ్యప్రదేశ్‌లో భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తామని అప్పట్లో పార్టీ అధిష్ఠానం హామీ ఇచ్చింది. ఇక అస్సాం సీఎం రేను నుంచి తప్పుకుని హిమంత బిశ్వ శర్మకు అవకాశమిచ్చిన మాజీ ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలున్నాయి.

జేడీయూకు ఒకటా.. రెండా..?

భాజపా మిత్రపక్షమైన జేడీయూకు కూడా ఈ సారి కేబినెట్‌లో స్థానం కల్పించాలని మోదీ సర్కారు భావించింది. తమకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని జేడీయూ కోరింది. అయితే ఒకరికి కేబినెట్‌ పదవి ఇచ్చి.. మరొకరిని సహాయ మంత్రిని చేస్తామని భాజపా చెప్పినట్లు తెలుస్తోంది. 2019లో రెండో దఫా భాజపా ప్రభుత్వం ఏర్పాటు సమయంలోనే జేడీయూకు ఒక కేబినెట్‌ పదవి ఇస్తామని కాషాయ పార్టీ ఆఫర్‌ చేసింది. అయితే దాన్ని నితీశ్ కుమార్‌ తిరస్కరించారు.

2019లో మోదీ రెండో దఫా ప్రధాని పదవి చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి మంత్రివర్గ విస్తరణ ఇది. నిబంధనల ప్రకారం.. కేంద్ర మంత్రివర్గంలో గరిష్ఠంగా 81 మంది మంత్రులు ఉండొచ్చు. అయితే ప్రస్తుతం కేబినెట్‌లో 53 మంది మాత్రమే ఉన్నారు. అంటే ఇంకా 28 మందిని కేబినెట్‌లోకి తీసుకునే అవకాశముంది. కాగా.. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువ మందికి అవకాశాలిచ్చే సంకేతాలు కన్పిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. కేంద్ర మంత్రులు, భాజపా జాతీయాధ్యక్షుడితో నేడు జరగాల్సిన ప్రధాని కీలక భేటీ రద్దవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని