Kaali Poster: ‘కాళీ’ వివాదం.. మరో అభ్యంతరకర పోస్ట్‌ చేసిన మణిమేగలై

దర్శకురాలు లీనా మణిమేగలై విడుదల చేసిన ‘కాళీ’ పోస్టర్‌పై ఓ వైపు దేశవ్యాప్తంగా దుమారం రేగుతుండగానే.. ఆ దర్శకురాలు తాజాగా మరో అభ్యంతరకర పోస్ట్‌ పెట్టారు. దేవుళ్ల వస్త్రధారణలో ఉన్న వ్యక్తులు

Published : 07 Jul 2022 10:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దర్శకురాలు లీనా మణిమేగలై విడుదల చేసిన ‘కాళీ’ పోస్టర్‌పై ఓ వైపు దేశవ్యాప్తంగా దుమారం రేగుతుండగానే.. ఆ దర్శకురాలు తాజాగా మరో అభ్యంతరకర పోస్ట్‌ పెట్టారు. దేవుళ్ల వస్త్రధారణలో ఉన్న వ్యక్తులు సిగరెట్‌ తాగుతున్న ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేసిన లీనా.. ‘ఎక్కడో మరోచోట’ అనే పదాన్ని రాశారు. తాజా వివాదానికి కారణమైన ‘కాళీ’ పోస్టర్‌ కోవలోనే ఈ ఫొటో ఉండటం గమనార్హం. కాళీ వివాదం విషయంలో తనపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో.. తాజా పోస్ట్‌తో లీనా తన వాదనను సమర్థించుకునేయత్నం చేసింది.

తమిళనాడు మధురైకి చెందిన లీనా మణిమేగలై.. ‘రిథమ్స్‌ ఆఫ్‌ కెనడా’లో భాగంగా ‘కాళీ’ పేరుతో ఓ డాక్యుమెంటరీ చిత్రీకరించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కెనడాలోని టొరంటోలోని ఉన్న అగాఖాన్‌ మ్యూజియంలో విడుదల చేశారు. అయితే, ఆ పోస్టర్‌ దేవతా మూర్తిని కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ భారత్‌లో నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అందులోకి కాళీ చేతిలో సిగరెట్‌ కన్పించడం, వెనుకవైపు స్వలింగ సంపర్కుల జెండా వంటివి తీవ్ర వివాదానికి దారితీశాయి.

ఈ క్రమంలోనే ఆమె చేసిన పోస్ట్‌ మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందంటూ పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. అటు కెనడాలోని భారత హైకమిషన్‌ కూడా దీన్ని తీవ్రంగా పరిగణించింది. దీంతో స్పందించిన అగాఖాన్‌ మ్యూజియం.. ఆ డాక్యుమెంటరీని ప్రదర్శన నుంచి తొలగించింది. అటు ట్విటర్‌ కూడా లీనా పోస్టర్‌ను తొలగించింది. ఇదిలా ఉండగా.. ఈ పోస్టర్‌పై స్పందిస్తూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం కూడా తీవ్ర దుమారం రేపింది. దీంతో ఆమెపైనా కేసులు నమోదయ్యాయి. అయితే తాను ఏ చిత్రానికీ, ఏ పోస్టర్‌కూ మద్దతు ఇవ్వలేదని, ధూమపానం అనే పదాన్ని అసలు వాడనేలేదని వివరణ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని