WHO: ఖాళీ విమానాలు పంపండి.. అఫ్గాన్‌కు వైద్యసామగ్రి, ఆహారం తరలిద్దాం

తాలిబన్ల ఆక్రమణతో అఫ్గాన్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారిన విషయం తెలిసిందే. దేశం విడిచి వెళ్లేందుకు అమెరికా, భారత్‌ తదితర దేశాల పౌరులతోపాటు స్థానికులూ కాబుల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి పోటెత్తుతున్నారు. దీంతో ఎయిర్‌పోర్టు లోపల, పరిసరాల్లో వారం రోజులుగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి...

Published : 24 Aug 2021 01:40 IST

ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్‌వో పిలుపు

జెనివా: తాలిబన్ల ఆక్రమణతో అఫ్గాన్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారిన విషయం తెలిసిందే. దేశం విడిచి వెళ్లేందుకు అమెరికా, భారత్‌ తదితర దేశాల పౌరులతోపాటు స్థానికులూ కాబుల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి పోటెత్తుతున్నారు. దీంతో ఎయిర్‌పోర్టు లోపల, పరిసరాల్లో వారం రోజులుగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో.. గత వారం వ్యవధిలో అఫ్గాన్‌కు వాయుమార్గంలో చేరుకోవాల్సిన 500 టన్నులకు పైగా వైద్య, ఆహార సామగ్రి సరఫరా నిలిచిపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) సోమవారం ఆందోళన వ్యక్తం చేసింది. స్థానికంగా శస్త్రచికిత్స పరికరాలు, పోషకాహార కిట్లు అందుబాటులో లేకుండా పోయాయని వెల్లడించింది. ‘ఇక్కడి జనాభాలో సగం మంది ఇతర దేశాల సహాయం మీదే ఆధారపడి ఉంటారు. తాలిబన్ల ఆక్రమణల కారణంగా రెండు నెలల వ్యవధిలో దాదాపు మూడు లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వారందరికి ఆహారం, వైద్య సామగ్రి సరఫరా చేయడం అత్యవసరం.  పైగా కరవు కారణంగా వారి అవసరాలు మరింత పెరిగాయ’ని పేర్కొంది.

చిన్నారులనూ ఆదుకోవాలి: యూనిసెఫ్‌

‘ప్రపంచ దేశాల దృష్టి అంతా ఇప్పుడు తమవారిని తరలించడం పైనే ఉంది. కానీ.. ఇక్కడే ఉండే మిగతావారికి సహాయం అందించేందుకు మాకు సామగ్రి అవసరమ’ని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి ఇనాస్ హమామ్ ఓ ప్రకటనలో తెలిపారు. తమ పౌరులను తీసుకొచ్చేందుకు వెళ్తున్న ఆయా దేశాల ఖాళీ విమానాలు.. మొదటగా దుబాయి, యూఏఈలోని డబ్ల్యూహెచ్‌వో గిడ్డంగులకు చేరుకుని, సామగ్రిని అఫ్గాన్‌కు తరలించాలని ఆమె కోరారు. ఈ దిశగా ‘మానవతా వాయు వారధి(హ్యూమానిటేరియన్‌ ఎయిర్‌ బ్రిడ్జ్‌) ఏర్పాటుకు సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు అఫ్గాన్‌లో చిన్నారుల దుస్థితిపై యూనిసెఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హెన్రిట్టా ఫోర్‌ సోమవారం స్పందించారు. అక్కడ దాదాపు కోటిమంది చిన్నారులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారని, మున్ముందు పరిస్థితులు దిగజారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని