
Kabul bomber: కాబుల్ బాంబర్ ఐదేళ్ల క్రితమే భారత్‌లో అరెస్టు..!
ఇంటర్నెట్‌డెస్క్: కాబుల్ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడిన బాంబర్ను ఐదేళ్ల క్రితమే భారత్ అరెస్టు చేసింది. అతడిని తిరిగి అఫ్గానిస్థాన్ సర్కారుకు అప్పజెప్పింది. ఈ విషయాన్ని ఐసిస్ భావజాల పత్రిక ‘స్వాత్ ఏ హింద్’ వెల్లడించింది. బాంబుదాడికి పాల్పడిన వ్యక్తిపేరు, ఇతర వివరాలను వెల్లడించింది. శత్రువులతో కలిసి అఫ్గాన్ అధికారులు దేశం విడిచి వెళ్లిపోతున్నందునే ఈ దాడికి పాల్పడినట్లు పేర్కొంది.
ఎవరీ బాంబర్..!
కాబుల్ ఎయిర్ పోర్టుపై దాడికి పాల్పడిన వ్యక్తి పేరు అబ్దుర్ రెహ్మాన్ అల్ లోగ్రిగా పేర్కొంది. 2017లో అతడు దిల్లీలో ఆత్మాహుతి దాడి ప్రణాళిక అమలు చేయడానికి వచ్చినప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఈ క్రమంలో అతన్ని అరెస్టు చేసి తిరిగి అఫ్గాన్ ప్రభుత్వానికి అప్పజెప్పారు. అతడు ఓ సంపన్న వ్యాపారవేత్త కుమారుడు. కశ్మీర్‌కు ప్రతీకారంగా ఈ దాడికి యత్నించాడు. కాబుల్ బాంబర్‌ను గతంలో అరెస్ట్ చేసిన విషయాన్ని భారత్ అధికార యంత్రాంగం ధ్రువీకరించలేదు. ఇదిలా ఉంటే.. 2017లో దిల్లీలోని లజపతి నగర్‌లో ఒక అఫ్గాన్ జాతీయుడిని అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. అతడు ఐసిస్ కోసం పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అతడిని అఫ్గాన్‌లోని అమెరికా దళాలకు అప్పగించారు. అతడే రెహ్మాన్ అని భావిస్తున్నారు.
అబ్దుర్ రెహ్మాన్ అల్ లోగ్రిని అమెరికా దళాలు ఇంటరాగేషన్ చేశాయి. వారికి చాలా కీలకమైన సమాచారం లభించింది. దీంతో ఆ తర్వాత పలు ఆపరేషన్లకు ఆ సమాచారం ఉపయోగపడింది.
లోగ్రికి పాకిస్థాన్‌లో ఉగ్ర శిక్షణ ఇచ్చినట్లు గుర్తించారు. అతడితోపాటు ఈ ప్రాంతంలో పేలుళ్లు జరపడానికి 12 మంది ఐసిస్ ఆపరేటర్లను పంపించారు. దాదాపు 18 నెలల పాటు అఫ్గాన్, దుబాయ్,భారత ప్రభుత్వాలు నిఘా ఉంచి ఆ 12 మంది వివరాలను సేకరించాయి. వీరిలో లోగ్రిని దిల్లీలో బాంబుదాడులు చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో భారత్ నిఘా సంస్థ రీసెర్చి అండ్ అనాలసిస్ వింగ్ తొలుత 50 వేల డాలర్ల నగదు దుబాయ్ నుంచి అఫ్గానిస్థాన్‌లోని ఒక ప్రదేశానికి బదిలీ అయినట్లు గుర్తించింది. అదే సమయంలో భారత్ ఉగ్రదాడికి లక్ష్యం కావచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు హెచ్చరించాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.