Published : 17 Nov 2021 02:40 IST

Afghanistan: వెల్లువలా దరఖాస్తులు.. మూతబడిన కాబుల్‌ పాస్‌పోర్ట్‌ ఆఫీస్

కాబుల్‌: అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించిన మొదలు.. పెద్దఎత్తున స్థానికులు దేశాన్ని విడిచిపెడుతోన్న విషయం తెలిసిందే. తాలిబన్ల పాలనలో హక్కులపై ఆందోళన, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం తదితర కారణాలతో వేలాది మంది ఇతర దేశాలకు తరలివెళ్తున్నారు. మరోవైపు ఇందుకు అవసరమైన పాస్‌పోర్టు, వీసా పత్రాల కోసం భారీ సంఖ్యలో పౌరులు కాబుల్‌లోని పాస్‌పార్ట్‌ కార్యాలయానికి పోటెత్తుతున్నారు. దరఖాస్తుల తాకిడికి.. ఈ ఆఫీస్‌లోని పరికరాలు మరమ్మతులకు గురికావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో మంగళవారం నుంచి సేవలను నిలిపేసినట్లు పాస్‌పోర్ట్ విభాగం డైరెక్టర్‌ ఆలం గుల్‌ హక్కానీ వెల్లడించారు.

దాదాపు 20 వేల మంది పడిగాపులు..

‘కాబుల్‌లోని పాస్‌పోర్ట్‌ కార్యాలయం బయట రోజు 15 వేల నుంచి 20 వేల మంది పడిగాపులు కాస్తున్నారు. ఆఫీస్‌ నిర్వహణ సామర్థ్యం కంటే ఇది ఐదారు రెట్లు ఎక్కువ. చాలా మంది రాత్రిపూట ఇక్కడే నిద్రపోతున్నారు’ అని హక్కానీ తెలిపారు. దరఖాస్తుల దాఖలుకు వీలుపడకపోతుండటంతో చాలా మంది పదేపదే రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, మరోవైపు బయోమెట్రిక్ యంత్రాలు తరచూ మొరాయిస్తుండటంతో ప్రక్రియ మరింత ఆలస్యమవుతోందని వివరించారు. దీంతో ప్రజలకు తిప్పలు తప్పించేందుకు, బయట గందరగోళాన్ని నివారించేందుకుగానూ తమ కార్యకలాపాలను కొన్ని రోజులు నిలిపేయాలని నిర్ణయించినట్లు ఆయన ఓ వార్తాసంస్థకు వెల్లడించారు. త్వరలోనే మళ్లీ ప్రారంభిస్తామని చెప్పారు.

నకిలీ పత్రాలు.. 60 మంది అరెస్ట్‌

పాస్‌పోర్ట్‌ల కోసం నకిలీ పత్రాలను సమర్పించినందుకుగానూ సంబంధిత విభాగానికి చెందిన పలువురు అధికారులతోసహా మొత్తం 60 మందిని అరెస్టు చేసినట్లు అఫ్గాన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. దరఖాస్తుల ఆమోదానికి అధికారులు లంచం డిమాండ్‌ చేస్తున్నారనే ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. కాబుల్ నుంచి అంతర్జాతీయ విమాన సేవలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. ప్రస్తుతం దుబాయ్, ఇస్లామాబాద్‌లకు సాధారణ సర్వీసులు నడుస్తున్నాయి. మరికొన్ని సంస్థలు ఛార్టర్‌ సేవలు అందిస్తున్నాయి.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని