Tamil Nadu: మామూళ్ల ‘మత్తు’లో అధికారులు

రద్దీ ప్రాంతంలోనే కల్తీసారా విక్రయాలు.. ఆమ్యామ్యాలకు అలవాటుపడ్డ యంత్రాంగం కళ్లు మూసుకోవడం.. వెరసి తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుణాపురం గ్రామాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది. శనివారంనాటికి కల్తీసారా మృతుల సంఖ్య 55కు చేరింది.

Published : 23 Jun 2024 04:58 IST

కల్తీసారా విక్రయాలకు రాజకీయ అండ
ప్రశ్నిస్తే వ్యాపారుల దాడులు
తమిళనాడు కరుణాపురంలో దారుణాలెన్నో..
55కు చేరిన మృతుల సంఖ్య

కళ్లకురిచ్చిలోని కరుణాపురం గ్రామం..

ఈనాడు-చెన్నై, న్యూస్‌టుడే-వేళచ్చేరి: రద్దీ ప్రాంతంలోనే కల్తీసారా విక్రయాలు.. ఆమ్యామ్యాలకు అలవాటుపడ్డ యంత్రాంగం కళ్లు మూసుకోవడం.. వెరసి తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుణాపురం గ్రామాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది. శనివారంనాటికి కల్తీసారా మృతుల సంఖ్య 55కు చేరింది. సారా విక్రేతలకు రాజకీయ అండ ఉండటంతో వారు ఆడిందే ఆటగా సాగింది. మిథనాల్‌ కలిపిన సారా తాగి కూలీల కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. కళ్లకురిచ్చి బస్టాండు సమీపంలోనే కరుణాపురం ఉంటుంది. అక్కడికి కూతవేటు దూరంలో ఉన్న పోలీసుస్టేషన్‌ సమీపంలో పది మంది వరకు సారా విక్రేతలున్నారని స్థానికులు చెబుతున్నారు. ఎవరినైనా వారు డబ్బుతో కొనేస్తారని వివరిస్తున్నారు. తన కుటుంబసభ్యులు తాగి అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారంటూ సారా విక్రేత ఒకరిని ప్రశ్నించిన మహిళను కొందరు కిరాయిగూండాలు దారుణంగా కొట్టారు. అప్పటినుంచి ఊళ్లో ఎవరూ నోరు విప్పడం లేదు. 

డోర్‌ డెలివరీ స్కీం

ఊళ్లో ఏ కార్యమున్నా మద్యం వ్యసనపరులు కలిసి కూర్చుని తాగుతారు. కొత్తగా అలవాటు చేసుకునేవారికి ఇక్కడి విక్రేతలు రహస్య ఫోన్‌నంబరును ఇచ్చి ఇంటికే సరకు పంపుతారు. ఇందుకోసం వ్యాపారుల వద్ద సిబ్బంది ఉన్నారు. ఇంటికి ఇలా తెప్పించుకుని గుట్టుగా తాగేవారు పెరిగారు. డోర్‌ డెలివరీ స్కీమ్‌లతో పాఠశాల విద్యార్థులూ పక్కదారి పడుతున్నారు. 15 ఏళ్లలోపు పిల్లలు సైతం పెద్దలతో కలిసి తాగుతున్నారు. 18 ఏళ్లు దాటిన వారిలో నిత్యం తాగేవారున్నారు. చిన్నవారి నుంచి పెద్దవారిదాకా గ్రామంలో సుమారు 60 శాతం మంది మద్యానికి బానిసలయ్యారు. పోలీసులెవరైనా పట్టుకుంటే వెంటనే విడిపించుకుని వచ్చేలా ప్రత్యేక వ్యవస్థను వ్యాపారులు ఏర్పాటు చేసుకున్నారు. ఊళ్లో గంజాయి వాడకం సైతం విస్తరిస్తోంది.

మహిళల నుంచే సహకారం

ఇక్కడి సారా బాధిత కుటుంబాల్లో మార్పు తెచ్చేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. ‘కల్తీసారా మరణాలు ఇక్కడ సాధారణమవుతున్నాయి. ఎక్కువ మంది మానడానికి సిద్ధంగా లేరు. మహిళలు మాత్రమే సహకరిస్తున్నారు. ప్రభుత్వమూ చైతన్య కార్యక్రమాలు చేపట్టాలి’ అని వాలంటీరు ఎస్‌.రాజన్‌ అన్నారు. 

బాధితులు ఆసుపత్రుల్లోనే..

కల్తీసారాతో 55 మంది మరణించారని.. ఇందులో 49మంది పురుషులు, ఆరుగురు మహిళలని రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరించింది. వైద్య సిబ్బంది కొనసాగిస్తున్న సర్వేలో బాధితుల సంఖ్య 213కు చేరింది. బాధితులు ఆసుపత్రుల్లో చేరుతూనే ఉన్నారు. సారావిక్రేత చిన్నదురైతో కలిపి పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌ నుంచి మిథనాల్‌

కల్తీసారా తయారీలో వాడిన మిథనాల్‌ ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చినట్లు తాజా విచారణలో వెల్లడైంది. తెలంగాణలోని హైదరాబాద్‌ నుంచి రైలులో చెన్నైకి, అక్కడినుంచి పుదుచ్చేరి, కళ్లకురిచ్చికి మిథనాల్‌ తరలించినట్లు తొలుత అధికారులు భావించారు. ఈ రసాయనం ఆనవాళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లోనూ ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ మూతపడిన ఓ పరిశ్రమ నుంచి సరఫరా అయినట్లు చెబుతున్నారు. మదన్‌కుమార్‌ అనే దళారీ నుంచి సీబీసీఐడీ కూపీ లాగుతోంది. గతేడాది అతడు విళుపురం జిల్లా మరక్కాణంలో 22 మంది కల్తీసారాతో మృతి చెందిన కేసులో జైలుకు వెళ్లాడు. విడుదలయ్యాక మళ్లీ వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. గతంలో చెన్నైలో విష రసాయనాన్ని కొన్న అతడు ఈసారి ఏపీలో కొని సరఫరా చేసినట్లు తెలుస్తోంది.


చిన్నప్పటి నుంచి చూస్తున్నా..

‘కల్తీసారాతో సోదరుణ్ని కోల్పోయా. ఎంత చెప్పినా ఊళ్లో ఎవరూ తాగుడు మానడం లేదు. కల్తీసారా మరణాలేమీ కొత్త కావు. ఇలాంటి ఘోరం మళ్లీ జరగదనే భరోసా లేదు. ఇక్కడ ఒకరు మూడేళ్లుగా కల్తీ సారా అమ్ముతున్నాడు. ఆయన కుటుంబం ఏళ్లనుంచి ఇదే పనిలో ఉంది’.

అలమేలు, కళ్లకురిచ్చి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు