
రెండో డోసు తీసుకున్న కమలా హారిస్
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కరోనా టీకా రెండో డోసు మంగళవారం తీసుకున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్(ఎన్ఐహెచ్) కార్యాలయం నుంచి దీన్ని ప్రత్యక్షప్రసారం చేశారు. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఈ సందర్భంగా అమెరికా ప్రజల్ని ఆమె విజ్ఞప్తి చేశారు. డిసెంబరు 29న ఆమె తొలి డోసు తీసుకున్న విషయం తెలిసిందే.
అమెరికాలో డిసెంబరులోనే వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజుల్లో నెమ్మదిగా సాగిన వ్యాక్సినేషన్.. గత వారం రోజుల్లో వేగం పుంజుకుంది. ఇప్పటి వరకు 2,44,83,819 మందికి టీకా అందజేశారు. జనవరి 20న అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన బైడెన్.. తన తొలి 100 రోజుల పాలనలో 10 కోట్ల మందికి టీకా ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు ఇప్పటికే 40 కోట్ల డోసుల కోసం కొనుగోలు ఒప్పందం చేసుకున్న అమెరికా మరో 20 కోట్ల డోసులకు ఆర్డర్ ఇచ్చేందుకు సిద్ధమైంది. అత్యవసర వినియోగానికి అనుమతి లభించిన ఫైజర్, మోడెర్నా టీకాలను ఒక్కోటి 10 కోట్ల డోసుల చొప్పున కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు శ్వేతసౌధం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. కొత్తగా ఆర్డర్ చేసిన డోసులు వేసవినాటికి సమకూరే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. తాజా వాటితో కలిపి అమెరికా ఇప్పటి వరకు ఆ దేశ ప్రజలందరికీ సరిపడా వ్యాక్సిన్లకు ఆర్డర్ చేసింది.
ఇవీ చదవండి...
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.