Train Accident: గమ్యం చేరిన కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌

పశ్చిమ బెంగాల్‌లో గూడ్సు రైలు ఢీకొని ప్రమాదానికి గురైన కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ మంగళవారం 850 మంది ప్రయాణికులతో గమ్య స్థానమైన సీల్దాహ్‌కు చేరుకుంది.

Published : 19 Jun 2024 05:56 IST

850 మందితో సీల్దాహ్‌కు రాక
రైళ్ల రాకపోకల పునరుద్ధరణ
10కి చేరిన మృతుల సంఖ్య

సిలిగురి, కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో గూడ్సు రైలు ఢీకొని ప్రమాదానికి గురైన కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ మంగళవారం 850 మంది ప్రయాణికులతో గమ్య స్థానమైన సీల్దాహ్‌కు చేరుకుంది. ప్రమాదంలో దెబ్బతినకుండా మిగిలిన బోగీలతో రైలును తెల్లవారుజామున 3.16 గంటలకు అధికారులు గమ్యస్థానానికి చేర్చారు. ప్రయాణం మధ్యలో అన్ని స్టేషన్లలో ప్రయాణికులకు వైద్య సాయాన్ని, ఆహారాన్ని, మంచినీటిని అందించారు. సీల్దాహ్‌ నుంచి వారిని ఇళ్లకు చేర్చారు. న్యూజల్పాయ్‌గుడికి సమీపంలో ఈ రైలు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సోమవారం 9 మంది మరణించగా.. మంగళవారం ఆసుపత్రిలో మరొకరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 10కి చేరుకుంది. రంగపానీ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో రైలుకు సంబంధించిన నాలుగు బోగీలు ధ్వంసమయ్యాయి. 

  • 13174 నంబరు కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ అగర్తల నుంచి సీల్దాహ్‌కు సోమవారం సాయంత్రం 7.20 గంటలకు చేరుకోవాల్సి ఉంది. ప్రమాదం జరగడంతో 8 గంటల తర్వాత గమ్యానికి చేరుకుంది. రవాణాశాఖ 16 బస్సులను, 60 కార్లను ఏర్పాటు చేసి  ప్రయాణికులను ఇళ్లకు చేర్చింది. 
  • ప్రమాదం అనంతరం యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టిన రైల్వేశాఖ మంగళవారం రైళ్ల రాకపోకలను అనుమతించింది.
  • సోమవారం నార్త్‌ బెంగాల్‌ మెడికల్‌ కళాశాల, ఆసుపత్రికి (ఎన్‌బీఎంసీహెచ్‌) 8 మృత దేహాలను తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. దీంతో 10 మంది మృతి చెందినట్లయింది. చనిపోయిన వారిలో ఆరేళ్ల బాలిక ఉంది. సోమవారం 37 మందిని ఆసుపత్రిలో చేర్చారు. వారిలో ఇద్దరు మరణించగా.. ప్రాథమిక చికిత్స అనంతరం మరో ఇద్దరు ఇంటికి వెళ్లిపోయారు. 
  • ట్రామా కేర్‌ యూనిట్‌లో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. వారికి శస్త్రచికిత్సలు చేశారు. మరికొందరికి కాళ్లు, చేతులు విరిగాయి. వారందరికీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 

రైల్వే మంత్రి రాజీనామా చేయాలి: కాంగ్రెస్‌

కేంద్ర ప్రభుత్వం రైల్వేల విధ్వంసానికి పాల్పడుతోందని కాంగ్రెస్‌ పార్టీ ధ్వజమెత్తింది. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ రాజీనామా చేయాలని డిమాండు చేసింది. ఘటనా స్థలికి మంత్రి మోటార్‌ సైకిల్‌పై వెళ్లి రీల్స్‌ చేసుకున్నారని, ఆయన రైల్వే మంత్రా.. రీల్స్‌ మంత్రా అని నిలదీసింది. ఎక్కడ ప్రమాదం జరిగినా కెమెరాలను వెంటబెట్టుకుని మంత్రి వెళ్తారని, అంతా బాగుందని చెబుతారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఈ ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారని మోదీ, వైష్ణవ్‌లను ప్రశ్నించారు. ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వానికి ఆయన 7 ప్రశ్నలను సంధించారు. బాలేశ్వర్‌ ప్రమాదం తర్వాత ఒక్క కిలోమీటరుకైనా అదనంగా కవచ్‌ను ఎందుకు విస్తరించలేదని, రైల్వేలో 3 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఖాళీగా ఉన్నాయని, 2017-2021 మధ్య రైలు ప్రమాదాల కారణంగా లక్ష మంది మరణించారని.. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఖర్గే ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని