Kangana Ranaut: నాకేదైనా జరిగితే వారిదే బాధ్యత: కంగనా రనౌత్‌

ముంబయి దాడులపై ఇటీవల తాను చేసిన పోస్ట్‌ విషయంలో హత్యా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులపై నటి కంగనా రనౌత్ హిమాచల్‌ప్రదేశ్‌లోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంగళవారం తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో ఎఫ్‌ఐఆర్‌ పత్రాలను షేర్ చేస్తూ.. ఆమె ఈ విషయాన్ని...

Published : 01 Dec 2021 01:32 IST

శిమ్లా: ముంబయి దాడులపై ఇటీవల తాను చేసిన పోస్ట్‌ విషయంలో హత్యా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులపై నటి కంగనా రనౌత్ హిమాచల్‌ప్రదేశ్‌లోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంగళవారం తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో ఎఫ్‌ఐఆర్‌ పత్రాలను షేర్ చేస్తూ.. ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ముంబయి ఉగ్రదాడుల తరహా ఘటనల్లో దేశ ద్రోహుల హస్తం ఉంది.. వారు దేశ వ్యతిరేక శక్తులకు సహాయం చేస్తూనే ఉన్నారు అంటూ ఇటీవల పోస్టు చేశాను. అప్పటినుంచి దీనిపై నిరంతరం బెదిరింపులు వస్తున్నాయి. పంజాబ్‌లోని భటిండాకు చెందిన ఓ వ్యక్తి చంపేస్తానని బహిరంగంగా బెదిరించాడు. ఇటువంటివాటికి నేను భయపడను. అలాంటి వారి గురించి మాట్లాడుతూనే ఉంటాను. వారు అమాయక జవాన్లను చంపిన నక్సలైట్లు కావచ్చు.. పంజాబ్‌ నుంచి ఖలిస్తాన్‌ను విడదీయాలని కలలు కంటూ విదేశాల్లో కూర్చున్న ఉగ్రవాదులూ కావచ్చు’ అని రాసుకొచ్చారు. 

సోనియా గాంధీకి విజ్ఞప్తి..

ఈ కేసు విషయమై తక్షణమే చర్యలు తీసుకునేలా పంజాబ్‌ ముఖ్యమంత్రిని ఆదేశించాలంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకీ కంగనా విజ్ఞప్తి చేశారు. ‘మీరు కూడా ఒక మహిళ. ఇందిరా గాంధీ సైతం చివరి క్షణం వరకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడారు. అటువంటి విద్రోహ శక్తుల నుంచి వస్తున్న బెదిరింపులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పంజాబ్ ముఖ్యమంత్రిని ఆదేశించండి’ అని కోరారు. దీంతోపాటు పంజాబ్‌లో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. కొంతమంది సందర్భం లేకుండా తన మాటలను ఉపయోగిస్తున్నారంటూ కంగనా ఆరోపించారు. భవిష్యత్తులో తనకేదైనా జరిగితే.. ద్వేషపూరిత రాజకీయాలు చేసేవారు మాత్రమే దీనికి బాధ్యత వహిస్తారని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. భారత స్వాతంత్ర్యం, రైతు ఉద్యమాలపై కంగనా ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని