రైతు ఉద్యమానికి థన్‌బర్గ్‌, రిహానా మద్దతు!

దిల్లీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు ప్రముఖ పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రేటా థనబర్గ్‌ సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి ట్విటర్‌లో.........

Updated : 03 Feb 2021 14:09 IST

మండిపడ్డ కంగనా రనౌత్‌

దిల్లీ: దిల్లీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు ప్రముఖ పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రేటా థనబర్గ్‌ సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి ట్విటర్‌లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రైతుల ఉద్యమం సాగుతున్న తీరు.. దిల్లీలో పలు ప్రాంతాల్లో విధించిన ఆంక్షల వంటి అంశాల్ని ప్రస్తావిస్తూ ప్రముఖ మీడియా సంస్థ సీఎన్‌ఎన్‌ ప్రచురించిన ఓ కథనాన్ని థన్‌బర్గ్‌ తన పోస్ట్‌కు జత చేశారు.

ఎందుకు మాట్లాడడం లేదు: రిహానా

అంతకుముందు ప్రముఖ పాప్‌ సింగర్‌ రిహానా సైతం భారత్‌లో రైతులు చేస్తున్న ఉద్యమంపై మాట్లాడారు. ‘‘మనమెందుకు దీని గురించి మాట్లాడటం లేదు?’’ అంటూ రైతుల ఉద్యమంపై సీఎన్‌ఎన్‌ ప్రచురించిన కథనాన్ని ట్వీట్‌ చేశారు. రిహానా ట్వీట్‌ మంగళవారం ట్విటర్‌లో చాలాసేపు ట్రెండ్‌ అవడం గమనార్హం. అనేక మంది ఆమె ట్వీట్‌కు స్పందించారు. కొంతమంది ఆమెకు మద్దతు తెలిపితే.. మరికొంత మంది పూర్తిస్థాయి అవగాహన తర్వాత స్పందించాలని హితవు పలికారు.

ఇందుకే మాట్లాడడం లేదు: కంగన

రిహానా ట్వీట్‌పై ప్రముఖ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ తీవ్రంగా మండిపడ్డారు. ‘‘ఉద్యమం చేస్తున్నది రైతులు కాదు. దేశాన్ని విభజించాలనుకుంటున్న ఉగ్రవాదులు. దేశాన్ని ముక్కలుముక్కలుగా చేసి చైనా కాలనీగా మార్చాలనుకుంటున్నారు. మీవలే మేం మా దేశాన్ని అమ్మాలనుకోవడం లేదు. అందుకే ఎవరూ మాట్లాడటం లేదు’’ అంటూరిహానాపై కంగనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. జనవరి 26న రైతులు చేపట్టిన గణతంత్ర పరేడ్‌ ఉద్రిక్తంగా మారడంతో దీక్షా శిబిరాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అలాగే ఫిబ్రవరి 6న మరోసారి భారీ ఎత్తున నిరసన ప్రదర్శనకు పిలుపునివ్వడం.. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అన్నదాతల కదలికలపై కఠిన ఆంక్షలు విధించారు. ఆయా ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవల్ని రద్దు చేశారు.

ఇవీ చదవండి...

నల్ల చట్టాలొద్దు రద్దు చేయండి

రహదార్లు.. దుర్భేద్యం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని