Kiccha Sudeep: ‘నీ ప్రైవేటు వీడియోలు విడుదల చేస్తా’: సుదీప్‌కు బెదిరింపు లేఖ

కన్నడ స్టార్‌ కిచ్చా సుదీప్‌((Kannada Star Kiccha Sudeep) భాజపాలో చేరతారనే వార్త విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఈ సమయంలో ఆయనకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. 

Updated : 05 Apr 2023 14:53 IST

బెంగళూరు: కన్నడ స్టార్‌ కిచ్చా సుదీప్‌(Kannada Star Kiccha Sudeep)ను బెదిరిస్తూ ఓ లేఖ వచ్చింది. బుధవారం ఆయన భాజపాలో చేరతారంటూ వార్తలు వస్తోన్న తరుణంలో ఈ ఘటన జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

వచ్చే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు(Karnataka Assembly Election)జరగనున్నాయి. ఈ క్రమంలో అధికార భాజపా, విపక్ష పార్టీలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. కన్నడ స్టార్‌ సుదీప్‌(Kiccha Sudeep)భాజపాలో చేరతారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సమయంలో ఆయన మేనేజర్‌కు ఒక బెదిరింపు లేఖ వచ్చింది. ఆయన ప్రైవేటు వీడియోలను సోషల్‌ మీడియాలో విడుదల చేస్తానంటూ అందులో బెదిరించారు. ఆ లేఖలో అభ్యంతరకర పదజాలం ఉందని నటుడి మేనేజర్ వెల్లడించారు. దీనిపై పుట్టెనహళ్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ తర్వాత బెంగళూరు సిటీ కమిషనర్ ఆదేశాలమేరకు ఈ కేసును సెంట్రల్ క్రైమ్‌ బ్రాంచ్‌కు బదిలీ చేశారు.

ఇదిలా ఉంటే.. ఈ రోజు మధ్యాహ్నం బెంగళూరు హోటల్‌లో సుదీప్‌(Kiccha Sudeep)తో పాటు మరో నటుడు దర్శన్ తూగుదీప(Darshan Thoogudeepa)భాజపాలో చేరతారని సమాచారం. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై, ఇతర పార్టీ నేతల సమక్షంలో వారు పార్టీలో చేరుతారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సుదీప్‌ ఎన్నికల్లో పోటీచేస్తారా..? లేక పార్టీ తరఫున ప్రచారం చేస్తారా..? అసలు పార్టీలో చేరతారా..? ఇలా ఏ ప్రశ్నపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. మధ్య కర్ణాటకలో ఈ స్టార్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది.

దక్షిణాది రాష్ట్రం కర్ణాటక (Karnataka)అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Election) ఇటీవల షెడ్యూల్‌ విడులైంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 10వ తేదీన పోలింగ్‌ జరగనుంది. మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.  ఈ ఎన్నికలకు ఏప్రిల్‌ 13న గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. ఏప్రిల్‌ 20 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని