Kapil sibal: కపిల్‌ సిబల్‌ కొత్త వేదిక.. కలిసి రావాలని సీఎంలకు పిలుపు

Kapil sibal New platform: అన్యాయానికి వ్యతిరేకంగా కొత్త వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మాజీ మంత్రి కపిల్‌ సిబల్‌ ప్రకటించారు. తన ఈ ప్రయత్నానికి మద్దతు ఇవ్వాలని విపక్ష పార్టీల నేతలను కోరారు.

Published : 04 Mar 2023 14:40 IST

దిల్లీ: ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్‌ సిబల్‌ (Kapil sibal) కొత్త వేదికను నెలకొల్పారు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన.. భాజపా ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు ‘ఇన్సాఫ్‌’ (Insaaf) పేరిట వేదికను స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల కోసం ‘ఇన్సాప్ కే సిపాహి’ పేరిట వెబ్‌సైట్‌ను సైతం అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఈ వేదిక ద్వారా ప్రజల తరఫున లాయర్లు పోరాటం చేస్తారన్నారు. విపక్ష పార్టీల ముఖ్యమంత్రులు, నేతలు తన ప్రయత్నానికి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ మేరకు దిల్లీలో విలేకరులతో మాట్లాడారు.

మార్చి 11న దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఓ సమావేశం ఏర్పాటు చేసి తన ఈ వేదిక లక్ష్యాలను వివరిస్తానని కపిల్‌ సిబల్‌ తెలిపారు. జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న ఈ వేదికకు అండగా నిలవాలన్నారు. ఇది ప్రజల వేదిక అని, తాను ఎలాంటి రాజకీయ పార్టీ స్థాపించడం లేదని స్పష్టంచేశారు. దేశంలోని ప్రతి ప్రాంతంలో ఆరెస్సెస్‌ శాఖలు తమ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయని, దీనివల్ల అన్యాయాలు జరుగుతున్నాయన్నారు. దీనిపై కూడా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు గతేడాది కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చిన కపిల్‌ సిబల్‌ సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభలో అడుగుపెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని