Kargil Vijay Diwas: అరుణాచల్‌ టు లద్ధాఖ్.. ‘విజయ్‌ దివస్‌’లో ప్రత్యేక ఆకర్షణగా మహిళల యాత్ర!

23వ ‘కార్గిల్‌ విజయ్ దివస్‌’ సంస్మరణ కార్యక్రమాల నిర్వహణకు భారత సైన్యం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే కార్గిల్‌ యుద్ధవీరుల త్యాగాలను మరోసారి గుర్తుచేసుకోనుంది...

Published : 22 Jul 2022 01:51 IST

లద్ధాఖ్‌: 23వ ‘కార్గిల్‌ విజయ్ దివస్‌’ సంస్మరణ కార్యక్రమాల నిర్వహణకు భారత సైన్యం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే కార్గిల్‌ యుద్ధవీరుల త్యాగాలను మరోసారి గుర్తుచేసుకోనుంది. ప్రధాన కార్యక్రమాన్ని లద్ధాఖ్‌లోని ద్రాస్‌లో ఉన్న ‘కార్గిల్ యుద్ధ స్మారకం‌’ వద్ద.. జులై 24 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు శ్రీనగర్‌లోని సైన్య ప్రజాసంబంధాల అధికారి కర్నల్ ఎమ్రాన్ ముసావి గురువారం వెల్లడించారు. ప్రముఖ పర్వతారోహకురాలు, పద్మభూషణ్‌ పురస్కార గ్రహీత బచేంద్రి పాల్ నేతృత్వంలో 50 ఏళ్లు పైబడిన 12 మంది మహిళల బృందం సాగిస్తోన్న అయిదు నెలల సుదీర్ఘ హిమాలయాల యాత్ర.. ఈ విడత ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు తెలిపారు.

విజయ్‌ దివస్‌లో భాగంగా ‘ఫిట్‌@50 ప్లస్‌’ పేరిట చేపట్టిన ఈ యాత్ర.. దాదాపు అయిదు నెలల క్రితం అరుణాచల్‌ప్రదేశ్‌లోని పాంగ్-సౌ పాస్ వద్ద ప్రారంభమైంది. ఇప్పటికే ఈ బృందం హిమాలయాల వెంబడి 37 పర్వత మార్గాలను దాటి.. 4,977 కిలోమీటర్లకుపైగా ప్రయాణించి, గురువారం నాటికి లమయూరు ప్రాంతానికి చేరుకుంది. ‘ఫైర్ అండ్ ఫ్యూరీ కోర్‌’ పరిధిలోని కార్గిల్ మీదుగా ప్రయాణించి 24న ద్రాస్‌లో ఈ యాత్ర ముగియనుంది. శారీరక, మానసిక దృఢత్వానికి.. ఆరోగ్యంగా ఉండటానికి.. వయస్సుతోపాటు ఆడామగా తేడాలు ఎటువంటి అవరోధాలు కావని ఈ ప్రయాణం చాటిచెప్పినట్లు కర్నల్‌ ముసావి తెలిపారు. ఈ క్రమంలోనే బచేంద్రి పాల్, బృంద సభ్యులను జులై 25న ఓ కార్యక్రమంలో సత్కరించనున్నట్లు చెప్పారు.

మరోవైపు.. ‘ఫరెవర్ ఇన్ ఆపరేషన్ డివిజన్’కు చెందిన దాదాపు 18 మంది ఆర్మీ సిబ్బంది బుధవారం ‘విక్టరీ మోటార్‌ సైకిల్ ర్యాలీ’ ప్రారంభించారు. లేహ్‌ జిల్లాలోని తుర్తుక్‌ నుంచి బయలుదేరిన ఈ బృందం.. జులై 26న ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్‌ వద్దకు చేరుకోనుంది. లద్ధాఖ్‌లోని కఠినమైన భూభాగం గుండా మొత్తం 481 కి.మీల మేర ఈ ర్యాలీ సాగనుంది.

‘విజయ్‌ దివస్’ వెనుక చరిత్ర..

1999లో కార్గిల్‌ ఆక్రమణకు ప్రణాళిక రచించిన పాక్‌ సైన్యం.. అక్కడి ఉగ్రవాదులతో కలిసి భారత భూభాగంలోకి ప్రవేశించింది. గొర్రెల కాపర్లు ఇచ్చిన సమాచారంతో భారత సైన్యం అప్రమత్తమై ‘ఆపరేషన్‌ విజయ్‌’ పేరుతో సైనిక చర్యను ప్రారంభించింది. పాక్‌ సైన్యం ఆక్రమించుకున్న పర్వత శిఖరాలను భారత్‌ సైన్యం పూర్తిగా స్వాధీనం చేసుకుంది. 1999 మే నుంచి జులై వరకూ ఇది కొనసాగింది. ఈ విజయానికి గుర్తుగానే.. ఈ ఆపరేషన్‌ పేరిట ఏటా జులై 26న ‘విజయ్‌ దివస్‌’ జరుపుకొంటాం. ఈ యుద్ధంలో భారత్‌ వైపు 527 యోధులు ప్రాణాలు కోల్పోగా.. పాక్‌ వైపు అత్యధికంగా 400 నుంచి 4,000 మంది మరణించి ఉంటారని అంచనా.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని