Karishma Mehta: మోదీని ఇంటర్వ్యూ చేసిన ఆ 22 నిమిషాలు.. !

సామాన్యుల జీవితాల్లోని సంఘర్షణ, వారి ఆకాంక్షలు కలబోస్తూ మానవీయ, స్ఫూర్తి నింపే కథనాలకు వేదికగా నిలుస్తోంది హ్యూమన్స్‌ ఆఫ్ బాంబే.

Updated : 24 Mar 2022 15:39 IST

దిల్లీ: సామాన్యుల జీవితాల్లోని సంఘర్షణ, వారి ఆకాంక్షలు కలబోస్తూ మానవీయ, స్ఫూర్తి నింపే కథనాలకు వేదికగా నిలుస్తోంది హ్యూమన్స్‌ ఆఫ్ బాంబే. దాని రూపకర్త కరిశ్మా మెహతా. ఆమె మూడేళ్ల క్రితం ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేసినప్పటి అనుభవాలను తాజాగా పంచుకున్నారు. తాను ఇప్పటికీ ఎందరో ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేసినా.. ప్రధానితో జరిపిన సంభాషణ ప్రత్యేకమైందని చెప్పారు. ఆమె కూడా గుజరాత్‌కు చెందిన వ్యక్తే. ఆ అనుబంధంతోనే మోదీ.. ‘ఎలా ఉన్నారు మెహతాజీ’ అంటూ తొలుత పలకరించారని గుర్తు చేసుకున్నారు.

‘అప్పుడు నాకు 27 సంవత్సరాలు. ఆ వయస్సులో మన దేశ ప్రధానిని ఇంటర్వ్యూ చేసే అవకాశం దక్కింది. 22 నిమిషాల పాటు పలు విషయాలపై నేను ఆయనతో మాట్లాడాను. ఆ 22 నిమిషాలు.. నా కెరీర్‌లో నేను వెళ్తోన్న మార్గాన్ని మార్చాయి. దాని వల్ల నా పనికి గుర్తింపు లభించింది. అంతేస్థాయిలో కొందరు నాపై ద్వేషం చిమ్మారు. ఆ అనుభవం నా ఆలోచనల్లో పరిణతి తెచ్చింది. అలాంటి సమయంలో మౌనంగా ఉండటం, అన్నింటికి మన పనే సమాధానం చెప్తుందని గ్రహించాను. ఇక మా మధ్య జరిగిన సంభాషణ, అనుభవాలు తర్వాత చెప్తాను. నేను ప్రధానిని కలిసిన మొదటి క్షణంలోనే... ‘ఎలా ఉన్నారు మెహతాజీ?’ అంటూ ఆయన ప్రశ్నించారు’ అని ఆమె లింక్డిన్‌లో పోస్టు పెట్టారు.

2019లో ఈ ఇంటర్వ్యూ జరిగింది. ఆ సందర్భంగా ప్రధాని తన బాల్యం, కుటుంబం, తాను అధికారంలోకి వచ్చిన క్రమాన్ని వివరించారు. హ్యూమన్స్ ఆఫ్‌ బాంబే ఆయన చెప్పిన విషయాలను ఐదు భాగాలుగా ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌ వేదికగా ప్రచురించింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని