Karnataka: ప్రభుత్వంపై విమర్శలు.. వేదికపై మైకు లాక్కున్న సీఎం

ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న స్వామీజీ చేతుల్లో నుంచి మైకు లాగేసుకున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Published : 27 Jan 2023 17:33 IST

బెంగళూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కన కూర్చుని ఓ స్వామీజీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ అనూహ్య పరిణామంతో తీవ్ర అసహనానికి గురైన కర్ణాటక (Karnataka) సీఎం బసవరాజ్‌ బొమ్మై.. ఆ స్వామీజీ చేతుల్లో నుంచి మైకు లాక్కుని విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. కర్ణాటకలోని మహదేవపురలో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

మహదేవపురలో జరిగిన ఓ బహిరంగ సభలో కాగినేలె మహాసంస్థాన కనక గురు పీఠాధిపతి ఈశ్వరనందపురి స్వామీజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెంగళూరులో సరైన మౌలికసదుపాయాలు లేక నగరవాసులు పడుతున్న అవస్థలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ‘‘బెంగళూరులో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. వరదలు వచ్చినప్పుడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు కేవలం వర్షాలు పడినప్పుడు మాత్రమే ఇక్కడకు వస్తున్నారు. ఇవన్నీ మేం చాలా కాలంగా చూస్తూనే ఉన్నాం. వర్షాలు పడుతున్నప్పుడు ప్రజలు ఇబ్బందులకు గురవకుండా ఏం చేయాలో అధికారులకు తెలియదా? సీఎం కూడా దీని గురించి గతంలో హామీలు ఇచ్చారు’’ అంటూ బొమ్మై సర్కారుపై విమర్శలు గుప్పించారు.

ఆ సమయంలో సీఎం బొమ్మై (Basavaraj Bommai) స్వామీజీ పక్కనే కూర్చున్నారు. ఆయన మాటలతో తీవ్ర అసహనానికి గురైన ముఖ్యమంత్రి.. స్వామీజీ మాట్లాడుతుండగానే మైకును చేతుల్లో నుంచి లాగేసుకున్నారు. ‘‘కేవలం హామీలు ఇచ్చి మర్చిపోయే ముఖ్యమంత్రిని కాదు నేను. అది కేవలం హామీ మాత్రమే కాదు. దానిపై మేం ఓ పథకం తీసుకొచ్చాం. నిధులు కూడా కేటాయించాం. పని జరుగుతుంది’’ అని విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. స్వామీజీ నుంచి సీఎం మైకును లాక్కుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కర్ణాటకలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ ఘటన ఆసక్తికరంగా మారింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని