DK Shivakumar: చన్నపట్న.. ఉప ఎన్నిక బరిలో డీకే శివకుమార్‌..?

కర్ణాటకలోని చన్నపట్నలో జరగనున్న ఉప ఎన్నికలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Published : 19 Jun 2024 16:49 IST

బెంగళూరు: జేడీఎస్‌ నేత కుమారస్వామి ప్రాతినిధ్యం వహిస్తోన్న చన్నపట్న అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ తరఫున ఎవరు పోటీ చేయనున్నరనే అంశం ఆసక్తికరంగా మారింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ (DK Shivakumar) బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. తాను ప్రజా నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని.. వారు కోరుకుంటే తప్పకుండా పోటీ చేస్తానని పేర్కొనడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది.

‘‘నా రాజకీయ జీవితాన్ని చన్నపట్న నుంచే ప్రారంభించా. నాలుగు సార్లు గెలుపొందా. అక్కడి ప్రజలు నన్ను ఆశీర్వదించారు. నా మనసులో వారిది ప్రత్యేక స్థానం. చన్నపట్న అభివృద్ధికి కృషి చేయాలనుకుంటున్నా. మరికొన్ని రోజుల్లో అక్కడ పర్యటిస్తా. స్థానిక నాయకులు, ఓటర్లు నేను పోటీ చేయాలని కోరుకుంటే.. వారి అభిప్రాయాన్ని తప్పకుండా గౌరవిస్తా’’ అని శివకుమార్‌ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

అగ్ని కీలల్లో పుస్తకాలు కాలిపోవచ్చు.. కాని జ్ఞానం కాదు: ప్రధాని మోదీ

ప్రస్తుతం శివకుమార్‌ కనకపుర స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చన్నపట్న, కనకపుర నియోజకవర్గాలు వొక్కలిగ ప్రాబల్యం అధికంగా ఉన్న రామనగర జిల్లా పరిధిలోకే వస్తాయి. ఇది బెంగళూరు రూరల్‌ లోక్‌సభ స్థానం కిందకు వస్తుంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి బావమరిది సీఎన్‌ మంజునాథ్‌ (భాజపా-జేడీఎస్‌ కూటమి తరఫున) ఇక్కడ నుంచి గెలుపొందారు. శివకుమార్‌ సోదరుడు డీకే సురేశ్‌ ఓటమిపాలయ్యారు.

సోదరుడి కోసం వ్యూహం..

ఒకవేళ చన్నపట్న నుంచి శివకుమార్‌ గెలిస్తే.. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న కనకపుర నుంచి సురేశ్‌ను పోటీలో దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేగా ఉన్న జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి కేంద్రమంత్రి పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తోన్న చన్నపట్న అసెంబ్లీ స్థానం ఖాళీ కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని