Mangoes: ‘ఫార్మర్‌ టు కస్టమర్‌..’ మామిడి పండ్ల విక్రయానికీ ఓ వెబ్‌సైట్‌!

వేసవిలో వచ్చే పండ్లలో ఎక్కువ మంది అమితంగా తినేది మ్యాంగో ఫ్రూట్‌నే‌. తీపితో పాటు జ్యూసీగా ఉండే ఈ పండ్లంటే ఇష్టపడని .......

Updated : 17 May 2022 22:40 IST

బెంగళూరు: వేసవిలో వచ్చే పండ్లలో ఎక్కువ మంది అమితంగా తినేది మామిడి పండు. తీపితో పాటు జ్యూసీగా ఉండే ఈ పండ్లంటే ఇష్టపడని వారు ఉండరు. మన దేశంలో వందల రకాల మామిడి పండ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, స్థానికంగా ప్రసిద్ధిగాంచిన రకాలు అధికంగా ఉండటంతో వాటిని సేకరించడం కష్టమే. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. లోకల్‌ మ్యాంగో రకాలను ఒకే వేదికపైకి తెచ్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏకంగా ఓ వెబ్‌సైట్‌నే రూపొందించింది. తమ రాష్ట్రంలో సాగయ్యే మామిడి పండ్లను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల నుంచి వినియోగదారులకు సరఫరా చేయడమే కర్ణాటక స్టేట్‌ మ్యాంగో డెవలప్‌మెంట్‌ అండ్‌ మార్కెటింగ్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (KSMD and MCL) ఈ నెల 16న ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇండియా పోస్ట్‌ సహకారంతో ప్రారంభించిన ఈ వెబ్‌సైట్‌ను కర్ణాటకలో ట్రేడ్‌మార్క్‌గా నిలిచే కర్సరి మామిడి రకం పేరు https://www.karsirimangoes.karnataka.gov.in పెట్టడం విశేషం. 

వినియోగదారులతో మామిడి రైతులను అనుసంధానం చేస్తూ.. సరసమైన ధరలకే తాజా మామిడి పండ్లను కస్టమర్లకు అందించే ఆలోచనతో ఈ చొరవ తీసుకుంది.  కేఎస్‌ఎండీ ప్రారంభించిన ఈ వెబ్‌సైట్‌లో దాదాపు 25 రకాల మామిడి పండ్లను విక్రయానికి ఉంచింది. ఇంకా దానిమ్మ, జామ, అవకాడో వంటి తాజా పండ్లను సైతం త్వరలోనే ఈ వెబ్‌సైట్‌ ద్వారా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి బెంగళూరు నగర వాసులకు మాత్రమే ఈ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకొని తమకు నచ్చిన మామిడి పండ్లను ఆర్డర్‌ చేసే వెసులుబాటు ఉంది. అయితే,  కనీసం 3 కిలోలు ఆర్డర్‌ చేయాల్సి ఉంటుంది. నోరూరించే రకరకాల మామిడి పండ్ల ఫొటోలు, వాటి ధరలు వంటి వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచారు. మీకు కావాల్సిన మామిడి పండ్లను ఎంచుకుంటే.. రైతులు నేరుగా బెంగళూరులోని జనరల్‌ పోస్ట్‌ ఆఫీస్‌ ద్వారా తాజా పండ్లను ప్యాక్‌ చేసి మీ ఇంటికే సరఫరా చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని