kebab: కబాబ్స్‌లో కృత్రిమ రంగుల వినియోగంపై నిషేధం

ఎంతోమంది ఇష్టంగా తినే స్ట్రీట్‌ఫుడ్‌ కబాబ్‌లో ఉపయోగించే కృత్రిమ రంగులను కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది. 

Published : 25 Jun 2024 12:53 IST

బెంగళూరు: పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే స్ట్రీట్‌ ఫుడ్స్‌లో కబాబ్‌(kebab) ఒకటి. ఇందులో రంగు కోసం ఉపయోగించే ఫుడ్‌ కలర్స్‌(artificial colours)పై కర్ణాటక(Karnataka) ప్రభుత్వం నిషేధం విధించింది. వెజ్‌-నాన్‌ వెజ్‌ కబాబ్స్‌లో కృత్రిమ రంగులు కలపడం వల్ల ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని పేర్కొంది.

రాష్ట్రవ్యాప్తంగా అమ్ముడవుతున్న కబాబ్‌లలో కృత్రిమ రంగులు ఉపయోగిస్తున్నారని, దీనివల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందని ఇటీవల మీడియా కథనాలు వెలువడడంతో ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ డిపార్ట్‌మెంట్ రంగంలోకి దిగింది. రాష్ట్రవ్యాప్తంగా విక్రయించే కబాబ్‌ల నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించింది. ఇవి నాసిరకంగా ఉన్నాయని గుర్తించిన అధికారులు కృత్రిమ రంగులపై నిషేధం విధించారు. ‘ఆహార భద్రత, ప్రమాణాల చట్టం 2006 ప్రకారం కృత్రిమ రంగులపై నిషేధం విధించామని, దీనిని అతిక్రమిస్తే జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తామని అధికారులు వెల్లడించారు.

గతంలో రాష్ట్రంలో అమ్ముతున్న కాటన్‌ క్యాండీ(పీచు మిఠాయి)లో కలిపే కృత్రిమ రంగుల్లో పేపర్‌ ప్రింటింగ్‌లో ఎక్కువగా వినియోగించే రోడమైన్‌-బి అనే కెమికల్‌ను కలుపుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇది ఎక్కువ మొత్తంలో మన శరీరంలోకి వెళ్తే.. కిడ్నీ, లివర్‌ పనితీరుపై ప్రభావం చూపుతుందని, అల్సర్‌ వంటి సమస్యలతో పాటు క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. దీంతో మార్చిలోనే పీచు మిఠాయిపై రాష్ట్రవ్యాప్తంగా నిషేధం విధించారు.

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని