Petrol Prices: వాహనదారులకు కర్ణాటక భారీ షాక్‌.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై వాత

Petrol Prices: పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది.

Published : 15 Jun 2024 18:09 IST

బెంగళూరు: కర్ణాటక (Karnataka)లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం వాహనదారులకు గట్టి షాకిచ్చింది. పెట్రోల్‌, డీజిల్‌ (Petrol Diesel Prices)పై రాష్ట్ర పరిధిలోని సేల్స్‌ ట్యాక్స్‌ను పెంచింది. దీంతో వీటి ధరలు రూ.3 మేర పెరిగాయి. ఈ పెంపు తక్షణమే (జూన్‌ 15 నుంచే) అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈమేరకు శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

పెట్రోల్‌పై కర్ణాటక సేల్స్‌ ట్యాక్స్‌ (Karnataka Sales Tax)ను 25.92శాతం నుంచి 29.84శాతానికి పెంచారు. ఇక, డీజిల్‌పై అమ్మకం పన్నును 14.3 శాతం నుంచి 18.44 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. తాజా పెంపుతో రాష్ట్రంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.3, డీజిల్‌ ధర రూ.3.05 మేర పెరుగుతున్నట్లు కర్ణాటక పెట్రోలియం డీలర్స్‌ అసిసోయేషిన్‌ తెలిపింది. దీంతో బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.102.86, డీజిల్‌ ధర రూ.88.94కు చేరింది. 

ఈ పెంపుతో రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.2,500-2,800 కోట్ల మేర ఆదాయం సమకూరనున్నట్లు కర్ణాటక ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. చివరిసారిగా రాష్ట్రంలో 2021 నవంబరులో అప్పటి భాజపా సర్కారు పెట్రోల్‌, డీజీల్‌ ధరలను సవరించింది. కొవిడ్‌ తర్వాత ప్రజలకు ఊరట కల్పించేందుకు పెట్రోల్‌పై రూ.13.30, డీజిల్‌పై రూ.19.40 మేర తగ్గించింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ధరలను సవరించడం మళ్లీ ఇప్పుడే. కాగా.. లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన వెంటనే చమురు ధరల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని