
ఆ రోగి ఎలా తప్పించుకోగలిగాడు? దర్యాప్తునకు కర్ణాటక సర్కార్ ఆదేశం
బెంగళూరు: ప్రపంచాన్ని భయపెడుతున్న ఒమిక్రాన్ మన దేశంలోనూ కలకలం రేపుతోంది. ఈ కొత్త వేరియంట్ సోకిన 66 ఏళ్ల దక్షిణాఫ్రికా వాసి కొన్ని రోజుల పాటు బెంగళూరులోని ఓ హోటల్లో ఐసోలేషన్‌లో ఉండి ఆ తర్వాత తప్పించుకుపోయిన అంశంపై కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆ రోగి ఓ ప్రైవేటు ల్యాబ్‌లో నెగెటివ్ సర్టిఫికెట్ పొందడంపైనా సందేహాల్ని వ్యక్తం చేసింది. అతడికి పాజిటివ్‌గా తేలిన మూడు రోజుల వ్యవధిలోనే నెగిటివ్ ఎలా వచ్చింది? అలాగే, ఓ కంపెనీ బోర్డు సమావేశంలో పాల్గొనడం.. జీనోమిక్ సీక్వెన్సింగ్ కోసం పంపిన శాంపిల్స్ నివేదికలు ఇంకా రావాల్సి ఉన్నప్పటికీ దేశం విడిచి వెళ్లిపోవడం తదితర అంశాలపై దర్యాప్తు చేయనున్నట్టు పేర్కొంది. అతడు వెళ్లిన ప్రైవేటు ల్యాబ్‌లో ఏమైనా అవకతవకలు జరిగాయా? అక్కడ పరీక్షలు పక్కాగా జరిగాయా? లేదా..? ఏదైనా తప్పు జరిగిందా..? తదితర కోణాల్లో విచారించాలని పోలీస్ కమిషనర్ని ఆదేశించినట్టు కర్ణాటక రెవెన్యూశాఖ మంత్రి ఆర్.అశోక తెలిపారు.
కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగిన అనంతరం మంత్రి అశోక విలేకర్లతో మాట్లాడారు. ఈ అంశంపై సిటీ హై గ్రౌండ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) చీఫ్ కమిషనర్ ఆదేశించినట్టు చెప్పారు. ‘‘రెండు నివేదికల్లో ఒకటి పాజిటివ్, మరొకటి నెగెటివ్‌గా రావడం అనుమానాస్పదంగా ఉంది. అందువల్ల ల్యాబ్పైనా కచ్చితంగా విచారణ జరగాలి. తక్షణమే ఆరోగ్యశాఖతో సమన్వయం చేసుకొని దర్యాప్తు చేయాలని పోలీస్ కమిషనర్ని ఆదేశించాం’’ అని మంత్రి తెలిపారు.
మొబైల్స్ స్విచాఫ్ చేసుకోవద్దు!
దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 10 మంది ప్రయాణికుల జాడ తెలియలేదంటూ వచ్చిన వార్తలపై మంత్రి స్పందిస్తూ.. ‘‘ఈ వార్తలు మీడియాలో వచ్చాయి. వాటిని పరిశీలించి వారిని ఈ రాత్రికల్లా ట్రేస్ చేసి పరీక్షలు చేయించాలని అధికారుల్ని ఆదేశించాం’’ అన్నారు. మరోవైపు, దీనిపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ స్పందిస్తూ.. దీనిపై అధికారిక సమాచారం ఏమీ లేదన్నారు. ఒకవేళ ఎవరి ఆచూకీ అయినా తెలియనట్లయితే.. గతంలోలానే.. వారిని గుర్తించే సమర్థత పోలీసులకు ఉందని చెప్పారు. కానీ, ఎవరూ తమ మొబైల్ఫోన్లను స్విచాఫ్ చేసుకొని, ఆచూకీ తెలియకుండా చేయొద్దని కోరారు. అది సరైన పద్ధతి కాదని, ప్రతిఒక్కరూ బాధ్యతతో ప్రవర్తించాలని సూచించారు.
► Read latest National - International News and Telugu News
Advertisement