Hijab Row: హిజాబ్‌ ఆదేశాలపై చట్ట ప్రకారమే నడుచుకున్నాం..!

హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టులో శుక్రవారం నాడు వాదనలు కొనసాగాయి.

Published : 18 Feb 2022 23:15 IST

కర్ణాటక హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాదనలు

బెంగళూరు: హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టులో శుక్రవారం వాదనలు కొనసాగాయి. హైకోర్టు ధర్మాసనం ముందు వాదనలు వినిపించిన రాష్ట్ర ప్రభుత్వం.. హిజాబ్‌ ధరించడం అనేది ఇస్లాం మత ఆచారంలో తప్పనిసరి అంశం కాదని తెలిపింది. ఈ విషయంలో భారత రాజ్యాంగం కల్పించే మత స్వేచ్ఛకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఏవిధమైన ఉల్లంఘన కిందకు రావని పేర్కొంది. కర్ణాటక ప్రభుత్వం తరపున అడ్వొకేట్‌ జనరల్‌ ప్రభులింగ్‌ నవాడ్గి హైకోర్టు ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు.

‘విద్యాచట్టాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. హిజాబ్‌ ధరించడం ముఖ్యమనే వాదన ఉంది. ఇస్లాం మత ఆచారంలో హిజాబ్‌ ధరించడం తప్పనిసరి కాదని మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. హిజాబ్‌ ధరించడాన్ని భావప్రకటన స్వేచ్ఛకు ఆపాదిస్తున్నారు. కానీ దాని కిందకు రాదు’ అని అడ్వొకేట్‌ జనరల్‌ ప్రభులింగ్‌ నవాడ్గి హైకోర్టు ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. అంతేకాకుండా ఆర్టికల్‌ 25ను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందంటూ కొందరు యువతులు ఆరోపించడాన్ని ఆయన తోసిపుచ్చారు. ఫిబ్రవరి 5న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు చట్టప్రకారం తీసుకున్నవేనని స్పష్టం చేశారు.

ఇదిలాఉంటే, హిజాబ్‌ వివాదంపై దాఖలైన పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు గత ఐదు రోజులుగా వాదనలు వింటోంది. గురువారం వరకు విద్యార్థుల తరపు న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. తాజాగా ప్రభుత్వ న్యాయవాది వాదనలు స్వీకరించింది. ఇక రాష్ట్రంలో హిజాబ్‌ వివాదం నెలకొన్న వేళ, విచారణ పూర్తయ్యే వరకూ పాఠశాలలకు ఎటువంటి మతపరమైన దుస్తులు ధరించి రావద్దని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని