IAS vs IPS: సోషల్‌ మీడియాలో రచ్చ.. మహిళా సివిల్‌ సర్వెంట్లపై బదిలీ వేటు

సామాజిక మాధ్యమాల్లో (Social Media) మహిళా సివిల్‌ సర్వెంట్లు (Civil Servants) చేసుకున్న ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారిద్దరిని ప్రస్తుత స్థానాల నుంచి బదిలీ చేస్తూ కర్ణాటక (Karnataka) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి వారిద్దరికీ ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు.

Updated : 21 Feb 2023 16:50 IST

బెంగళూరు: సామాజిక మాధ్యమాల్లో దూషణలకు దిగిన ఇద్దరు మహిళా సివిల్‌ సర్వెంట్లపై (Civil Servants) కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇద్దరు మహిళా అధికారులను ప్రస్తుత స్థానాల నుంచి బదిలీ చేసిన ప్రభుత్వం.. ఎక్కడా పోస్టింగ్‌ మాత్రం ఇవ్వలేదు. రూపా మౌద్గిల్‌ భర్త మునీష్‌ మౌద్గిల్‌ (IAS)ను కూడా బదిలీ చేసింది. ఇప్పటివరకు రెవెన్యూ విభాగంలో కమిషనర్‌గా ఉన్న ఆయన్ను డీపీఏఆర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా నియమించింది. ఇద్దరు మహిళా అధికారులపై చర్యలుంటాయని కర్ణాటక (Karnataka) హోం మంత్రి అరాగ జ్ఞానేంద్ర హెచ్చరించిన మరుసటి రోజే ఈ బదిలీలు చోటుచేసుకోవడం గమనార్హం.

ఐఏఎస్‌ అధికారిణి రోహిణీ సింధూరీ (Rohini Sindhuri), ఐపీఎస్‌ రూపా డి.మౌద్గిల్‌ల (Roopa Moudgil) మధ్య సామాజిక మాధ్యమాల్లో ఇటీవల చోటుచేసుకున్న వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఐఏఎస్‌ అధికారిణి రోహిణీ సింధూరిపై ఆరోపణలు చేస్తూ ఐపీఎస్‌ రూపా డి.మౌద్గిల్‌ ఫేస్‌బుక్‌ పేజీలు పోస్టు చేయడం ఈ వివాదానికి కారణమయ్యింది. రెచ్చగొట్టేలా ఉన్న ఫొటోలను కొందరు ఐఏఎస్‌లకు రోహిణి పంపించారని అందులో ఆరోపించారు. రూప ఆరోపణలపై స్పందించిన రోహిణి.. ‘ఆమె మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని.. నిరాధార ఆరోపణలు చేస్తూ, వాటిని రుజువు చేయమంటున్నారు’ అంటూ తిప్పికొట్టారు.

ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని ఇరువురు మహిళా అధికారులు చీఫ్‌ సెక్రటరీ వందితా శర్మకు పరస్పరం ఫిర్యాదు కూడా చేసుకున్నారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై.. అఖిల భారత సర్వీసు నిబంధనలకు కట్టుబడి ఉండాలంటూ ఇద్దరు మహిళా అధికారులకు చీఫ్‌ సెక్రటరీ మౌఖికంగా, లిఖితపూర్వకంగా సూచించారని అన్నారు. ఇలా సామాజిక మాధ్యమాల్లో మహిళా ఉన్నతాధికారుల దూషణల తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం వారిపై బదిలీ వేటు వేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని