Bengaluru Traffic Issue: ట్రాఫిక్‌ సమస్య తీర్చడానికి కట్టారు.. వర్షం కురిసేసరికి!

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బెంగళూరు (Bengaluru)లోని రామ్‌నగర (Ramnagara) ప్రాంతంలో నిర్మించిన అండర్‌ బ్రిడ్జ్‌లో భారీగా వరద నీరు చేరింది. దీంతో వాహనాలు ఒకదాన్నొకటి ఢీ కొంటున్నాయి. గత ఏడాది కూడా ఈ ప్రాంతంలో నీరు నిలిచిపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. (Bengaluru Trafiic Issue)

Published : 18 Mar 2023 18:07 IST

బెంగళూరు: గత ఏడాది భారీ వర్షాలతో సతమతమైన బెంగళూరు (Bengaluru) వాసులకు మళ్లీ ఆ కష్టాలు తప్పడం లేదు. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు రామ్‌నగర (Ramnagara) ప్రాంతంలోని నిర్మించిన అండర్‌ బ్రిడ్జ్‌లో పెద్ద మొత్తంలో వరద నీరు చేరిపోయింది. దీంతో అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాలు ఒకదాన్నొకటి వెనక నుంచి ఢీ కొడుతుండటంతో పాడవుతున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  గత ఏడాది కూడా ఇదే ప్రాంతంలో భారీగా నీరు నిలిచిపోయి, ప్రమాదాలకు కారణమైనప్పటికీ అధికారులు నివారణ చర్యలు తీసుకోవడం లేదని వాహనదారులు మండిపడుతున్నారు.

కొత్తగా రోడ్డు నిర్మించినప్పుడు కూడా నీరు నిలిచిపోకుండా తగిన ఏర్పాటు చేయలేదని, రాజకీయ అవసరాల కోసమే ఆగమేఘాల మీద రోడ్డును ప్రారంభించేశారని ప్రధాని మోదీ (PM Modi), ముఖ్యమంత్రి మంత్రి బసవరాజ్‌ బొమ్మై (Basavaraj Bommai)పై వాహనదారులు విమర్శలు గుప్పిస్తున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఎన్‌హెచ్‌ 275  రహదారిని బెంగళూరు నుంచి మైసూరు వరకు ఆరు లైన్లుగా మార్చారు. దీని కోసం దాదాపు రూ.8,480 కోట్లు ఖర్చు చేశారు. ఆరు రోజుల క్రితమే ప్రధాని మోదీ ఈ రోడ్డును జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే.

గత ఏడాది భారీ వర్షాలకు బెంగళూరు సమీపంలో రామ్‌నగర ప్రాంతంలో భారీ మొత్తంలో నీరు నిల్వ ఉండిపోవడంతో బెంగళూరు నగర ప్రజలు అవస్థలు పడాల్సి వచ్చింది. ఈ క్రమంలో అక్కడ భారీ అండర్‌ బ్రిడ్జ్‌ను ఏర్పాటు చేశారు. కానీ, అందులోకి చేరిన నీరు బయటకి వెళ్లేలా సరైన ఏర్పాట్లు చేయలేదు. దీంతో అండర్‌బ్రిడ్జ్ మొత్తం నీటితో నిండిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. మరోవైపు అండర్‌ బ్రిడ్జ్‌లో వరద నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. తాత్కాలిక ఏర్పాట్లు చేసేందుకు స్థానిక అధికారులు, సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని