
రైతన్నా.. మీకోసమే ఈ హెల్ప్‌లైన్ నెంబర్
24*7 హెల్ప్‌లైన్ నెంబరును ప్రవేశపెట్టిన కర్ణాటక ప్రభుత్వం
బెంగళూరు: పశువుల పెంపకదారులు, పాడిరైతుల శ్రేయస్సుకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేకించి 24 గంటలూ పనిచేసే హెల్ప్‌లైన్ నెంబరును ప్రారంభించింది. తద్వారా డైరీ ఉత్పత్తుల వివరాలు, పశువుల పెంపకం, వివిధ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తే అందేలా చేశారు. ఈ సందర్భంగా పశు సంవర్ధకశాఖ కమిషనర్ బసవరాజేంద్ర మాట్లాడుతూ ‘‘కర్ణాటకలో పశువుల సంఖ్య సుమారు 1.5కోట్లు. పశువుల పెంపకంతో పాటు వాటికొచ్చే వ్యాధులు, వ్యాక్సిన్ షెడ్యూల్ వివరాలు, డైరీ ఉత్పత్తుల విక్రయం తదితర వివరాలతో పాటు రైతులకొచ్చే ఇతర సందేహాలను నివృత్తి చేసేందుకే దీన్ని తీసుకొచ్చాం. కేవలం ఆవులకు సంబంధించిన వివరాలే కాకుండా.. మేకలు, పందుల పెంపకం గురించి ఎలాంటి సందేహాలు వచ్చినా అడిగి తెలుసుకోవచ్చు. ఇది ప్రతి జిల్లాల్లో పశువుల గణాంకాల సేకరణతో పాటు అన్నదాత కార్యక్రమాలను నిర్వహించేందుకు కూడా అనువుగా ఉంటుంది. అంతేకాదు, ఏదైనా ప్రత్యేక ప్రాంతంలో పశువులకు వ్యాధి సోకినా వెంటనే రైతన్నలను అప్రమత్తం చేయడంతో పాటు పుశువులకు ఇచ్చే వ్యాక్సిన్లు, మందులను త్వరితంగా అందించేందుకు ఈ మార్గం సులభంగా ఉంటుంది. దీని ద్వారా పశువుల పెంపకదారుల మధ్య సంబంధాలు బలపడతాయి. పశువైద్యులు సరిగ్గా స్పందించకపోయినా దీనిద్వారా రైతులు ఫిర్యాదు చేయొచ్చు. అవసరమైతే వాట్సాప్ కూడా చేయొచ్చు’’ అని తెలిపారు