Updated : 28 Apr 2022 17:01 IST

Karnataka: జాతీయ భాషపై చర్చ.. పార్టీలతో సంబంధం లేకుండా సుదీప్‌కు మద్దతు

బెంగళూరు: కన్నడ స్టార్ సుదీప్‌, బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్‌ల మధ్య జాతీయ భాషపై జరిగిన చర్చ విషయంలో కర్ణాటక నేతలు స్పందిస్తున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి బసవరాజ్ ఎస్‌ బొమ్మై సహా ప్రముఖ నాయకులందరూ సుదీప్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. 

‘భాషల వల్లే రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత ఇచ్చారు. సుదీప్ అన్న మాటలు సరైనవే. అందరూ వాటిని గౌరవించాలి’ అంటూ బొమ్మై అన్నారు. ఈయన కాస్త సున్నితంగానే స్పందించినా, మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, హెచ్‌డీ కుమారస్వామి.. అజయ్‌ దేవ్‌గణ్‌పై ఘాటుగా విమర్శలు చేశారు. ‘హిందీ ఎప్పటికీ మన జాతీయ భాష కాదు. మన దేశంలోని భాషా వైవిధ్యాన్ని గుర్తించడం ప్రతి భారతీయుడి కర్తవ్యం. ప్రతి భాషకు దాని ప్రజలు గర్వించదగ్గ చరిత్ర ఉంటుంది. నేను కన్నడ ప్రాంతం వాడిని అయినందుకు గర్విస్తున్నాను’ అంటూ సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. 

‘మొదటి నుంచి హిందీ ఆధారిత పార్టీలు.. ప్రాంతీయ భాషలను ధ్వంసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే భాష, ఒకే ప్రభుత్వం అనే భాజపా హిందీ జాతీయవాదానికి మారుపేరుగా అజయ్ మాట్లాడారు’ అంటూ మరో మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి అజయ్‌ను విమర్శించారు. మరో కాంగ్రెస్‌ సీనియర్ నేత డీకే శివకుమార్ స్పందిస్తూ..‘భారత్‌లో 19,500 మాతృభాషలు మాట్లాడుతున్నారు. భారతదేశంపై మా ప్రేమ ప్రతి భాషలోనూ ఒకేలా అనిపిస్తుంది. ఒక దానిపై మరొకటి ఆధిపత్యం చెలాయించకుండా కాంగ్రెస్ భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసింది’ అని వ్యాఖ్యానించారు. 

అసలు ఈ చర్చ ఎక్కడ మొదలైందంటే..?

ఇటీవల దక్షిణాది సినిమాలు ప్రపంచ స్థాయిలో ఆకట్టుకుంటున్నాయి. దాంతో హిందీ సినిమాలతో పోల్చుతూ పలు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలో ఓ ఆడియో ఫంక్షన్‌లో సుదీప్‌ మాట్లాడుతూ.. ‘కన్నడ చిత్ర పరిశ్రమ ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయి సినిమాలు చేస్తోందని కొందరు అంటున్నారు. కానీ, అందులో నిజం లేదు. పాన్‌ ఇండియా స్థాయి అని కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల్ని అలరించేలా మనం చిత్రాలు తెరకెక్కిస్తున్నాం. ఇకపై హిందీ మన జాతీయ భాష కాదు. హిందీ వారే ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయి చిత్రాలు రూపొందిస్తున్నారు. తమ సినిమాలను తమిళం, తెలుగు, కన్నడ.. ఇలా దక్షిణాది భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. అయినా, విజయం అందుకోలేకపోతున్నారు’ అని చేసిన వ్యాఖ్యలపై అజయ్‌ దేవ్‌గణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్విటర్‌ వేదికగా ‘సోదరా.. మీ ఉద్దేశం ప్రకారం హిందీ జాతీయ భాష కానప్పుడు మీరెందుకు మీ చిత్రాలను హిందీలో డబ్‌ చేస్తున్నారు? జాతీయ భాషగా హిందీ ఎప్పటి నుంచో ఉంది. ఎప్పటికీ అదే ఉంటుంది. జనగణమన’ అని అజయ్‌ పేర్కొన్నారు. అజయ్‌ ట్వీట్‌పై స్పందించిన సుదీప్‌.. ‘అజయ్‌ సర్‌.. మీకు మరో రకంగా అర్థమైందనుకుంటా. నేను ఎవరినీ కించపరిచేందుకు అలా చేయలేదు. మన దేశ భాషలన్నింటిపైనా నాకు గౌరవం ఉంది. మేం హిందీని గౌరవించాం, నేర్చుకున్నాం. అందుకే మీరు హిందీలో చేసిన ట్వీట్‌ను నేను చదవగలిగా. అదే నా సమాధానాల్ని కన్నడలో రాస్తే పరిస్థితి ఏంటి సర్‌? చదవగలరా. కాబట్టి ఏదైనా విషయం గురించి పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడటం వల్లే ఇలా జరుగుతుంటుంది’ అని రిప్లై ఇచ్చారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని