CoronaVirus: కరోనా ఎఫెక్ట్.. మళ్లీ అక్కడ మాస్కు తప్పనిసరి (టాప్- 10 పాయింట్లు)
ప్రపంచ దేశాల్లో మళ్లీ కొవిడ్(Covid) విజృంభణతో భారత్ అప్రమత్తమైంది. బెంగళూరు విమానాశ్రయంలో 12 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరోవైపు, కర్ణాటకలో మాస్కును తప్పనిసరి చేస్తున్నట్టు ఆరోగ్యమంత్రి సుధాకర్ వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: చైనా, జపాన్ సహా పలు ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ (Corona Virus) మళ్లీ విజృంభిస్తుండటంతో భారత్ అప్రమత్తమైంది. ఇప్పటికే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం.. వైద్య రంగం సన్నద్ధతపై మంగళవారం మాక్‌డ్రిల్ నిర్వహించాలని సూచించిన విషయం తెలిసిందే. విదేశాల నుంచి వస్తోన్న ప్రయాణికులకు ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేయడంతో పలు ఎయిర్‌పోర్టుల్లో పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో వారి కాంటాక్టులను ట్రేస్ చేస్తున్నారు. కరోనా మరోసారి కలకలం రేపుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో పరిస్థితి, తీసుకొంటున్న చర్యలకు సంబంధించి టాప్ 10 పాయింట్లు ఇవే..
- కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కును తప్పనిసరి చేస్తున్నట్టు వెల్లడించింది. సినిమా థియేటర్లు, పాఠశాలలు, కళాశాలల్లో మాస్కులు తప్పనిసరి చేసింది. న్యూఇయర్ వేడుకల్లో పబ్‌లు, రెస్టారంట్లు, బార్లలో మాస్కు తప్పనిసరిగా ధరించాల్సిందేనని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ వెల్లడించారు. నూతన సంవత్సర వేడుకలకు అర్ధరాత్రి 1గంట వరకే అనుమతి ఉంటుందన్నారు. కరోనా వల్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. ముందు జాగ్రత్తలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
- విదేశాల నుంచి భారత్‌కు వస్తోన్న ప్రయాణికులకు విమానాశ్రయాల్లో కొవిడ్ పరీక్షలు చేస్తుండటంతో పలువురికి పాజిటివ్‌గా తేలుతోంది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో 12మందికి పాజిటివ్‌గా తేలినట్టు అధికారులు తెలిపారు. డిసెంబర్ 24న 2867మందికి పరీక్షలు చేయగా.. వారిలో 12మందికి పాజిటివ్‌గా తేలింది. వీరి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్టు కర్ణాటక ఆరోగ్యమంత్రి సుధాకర్ ట్విటర్‌లో వెల్లడించారు.
- కొవిడ్‌పై ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ, సీఎస్ జవహార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై సీఎం దిశానిర్దేశం చేశారు.
- ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. ఆస్పత్రి పరిసరాల్లో మాస్కులను తప్పనిసరి చేసినట్టు డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్ వెల్లడించారు. లఖ్‌నవూలో ఆయన మాట్లాడుతూ.. అన్ని రద్దీ ప్రాంతాల్లో మాస్కు ధరించాలని కోరారు. అలాగే, ఆస్పత్రి పరిసరాల్లో మాత్రం మాస్కు ధరించడం తప్పనిసరన్నారు.
- బిహార్‌లోని గయ విమానాశ్రయంలో నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో ముగ్గురు మయన్మార్ నుంచి రాగా.. ఒకరు బ్యాంకాక్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. వారందరిలోనూ లక్షణాల్లేవని.. ఐసోలేషన్‌లో ఉన్నారని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.
- మూడు రోజుల క్రితం చైనా నుంచి దిల్లీ మీదుగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాకు వచ్చిన 40 ఏళ్ల వ్యక్తికి కొవిడ్-19 సోకిన విషయం తెలిసిందే. అయితే, అతడిని దిల్లీ నుంచి ఆగ్రాకు తీసుకొచ్చిన ట్యాక్సీ డ్రైవర్‌ను అధికారులు గుర్తించారు. కరోనా సోకిన వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. అతడితో కాంటాక్టు అయిన 27మందిని గుర్తించి వారి నమూనాలను సేకరించారు.
- ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీచేసింది. సిబ్బంది, అధికారులు, న్యాయవాదులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆదేశాలు జారీచేసింది. మాస్కు ధరించిన వారికే లోపలికి అనుమతి ఉంటుందని స్పష్టంచేసింది.
- కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఈరోజు భారతీయ వైద్య మండలి(IMA) సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దేశంలో కరోనా పరిస్థితి, కరోనాను ఎదుర్కొనే సన్నద్ధతపై చర్చించనున్నారు.
- అలాగే, కోల్‌కతా విమానాశ్రయంలో రెండు కొవిడ్ కేసుల్ని గుర్తించారు. వీరిలో ఒకరు దుబాయి నుంచి డిసెంబర్ 24న రాగా.. మరొకరు మలేషియాలోని కౌలాలాంపూర్ నుంచి వచ్చారని అధికారులు తెలిపారు. ఇద్దరి శాంపిల్స్‌ను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపినట్టు కోల్‌కతా విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.
- దేశంలో నిన్న 198 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3428కి చేరింది. నిన్న 190మంది కోలుకోవడంతో ప్రస్తుతం రికవరీ రేటు 98.8శాతంగా ఉంది. నిన్న దేశ వ్యాప్తంగా 35,173 టెస్టులు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.