Published : 16 Jul 2022 02:15 IST

Siddaramaiah: సిద్ధరామయ్యకు చేదు అనుభవం.. పరిహారం నగదును విసిరేసిన మహిళ

బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యకు (Siddaramaiah) చేదు అనుభవం ఎదురైంది. క్షతగాత్రులకు పరిహారంగా ఇచ్చిన రూ.2లక్షలను ఓ మహిళ ఆయన ఎస్కార్ట్‌ వాహనంపై విసిరేసింది. తమకు కావాల్సింది డబ్బులు కాదని, న్యాయం కావాలంటూ నినదించింది. కెరూర్ ఘటనలో గాయపడినవారికి పరామర్శించేందుకు సిద్ధరామయ్య వెళ్లగా ఈ ఘటన జరిగింది.

కెరూర్‌ పట్టణంలో జులై 7న ఇరువర్గాల మధ్య కలహాలు చెలరేగాయి. కొందరు వ్యక్తులు కత్తులు, రాడ్లతో బీభత్సం సృష్టించారు. ఈ దాడుల్లో ముగ్గురు హత్యకు గురికాగా, పలువురు గాయపడ్డారు. కెరూర్‌ ప్రాంత ఎమ్మెల్యే అయిన సిద్ధరామయ్య.. బాగల్‌కోటేలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించేందుకు శుక్రవారం ఆసుపత్రికి వెళ్లారు. ఒక్కో క్షతగాత్రుడికి తన సొంత డబ్బు రూ.50వేలు అందించారు. అయితే ఘర్షణల్లో గాయపడిన ఓ వ్యక్తి సహా నలుగురి కుటుంబీకులను పరామర్శించి, వారికి రూ.2లక్షల అందించి వెళుతున్న సిద్ధరామయ్యకు ఊహించని పరిణామం ఎదురైంది. కారు ఎక్కుతుండగా సిద్ధరామయ్య ఎస్కార్ట్‌ వాహనంపై గాయపడ్డ వ్యక్తి భార్య ఆ రూ.2లక్షల డబ్బులను విసిరేసింది. తమకు కావాల్సింది డబ్బులు కాదని, న్యాయం కావాలంటూ నినదించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

‘మేం ఏ తప్పు చేయకపోయినా, కారణం లేకుండా మా వారిపై దాడి చేశారు. గాయపడిన మా వారు ఏడాది పాటు విశ్రాంతి తీసుకోవాలి. మా సమస్యకు డబ్బు పరిష్కారం కాదు. భిక్షాటన చేసైనా మా కుటుంబాన్ని పోషించేందుకు సిద్ధంగా ఉన్నాం. మాకు న్యాయం కావాలి. ఇలా చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి’ అని ఆ మహిళ పేర్కొంది.

ఈ పరిణామంపై సిద్ధరామయ్య స్పందించారు. బాధితుల బాధను అర్థం చేసుకోవాలన్నారు. దీన్ని రాజకీయం చేయాలనుకోవడం లేదని పేర్కొన్నారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగా కెరూర్‌ రణరంగమైందని ప్రతిపక్ష నేత ఆరోపించారు. బాధితులకు అధికార భాజపా ఎలాంటి సాయం చేయలేదని, అందుకే వారికి తన సొంత డబ్బు పరిహారంగా ఇచ్చానని తెలిపారు.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని