Vaccine: టీకాతో ఏడాది పాటు రక్షణ

ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవిడ్ వ్యాక్సిన్ల ప్రభావం కనీసం ఒక సంవత్సరం పాటు ఉంటుందని కర్ణాటకకు  చెందిన ప్రముఖ వైరాలజిస్ట్ పేర్కొన్నారు. కొత్త వేరియంట్లు రాకపోతే....

Published : 30 May 2021 21:23 IST

మూడో దశ అనివార్యమన్న ప్రముఖ వైరాలజిస్ట్‌

బెంగళూరు: ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవిడ్ వ్యాక్సిన్ల ప్రభావం కనీసం ఒక సంవత్సరం పాటు ఉంటుందని కర్ణాటకకు  చెందిన ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్‌ వి.రవి పేర్కొన్నారు. కొత్త వేరియంట్లు రాకపోతే టీకాల ప్రభావం రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు కూడా ఉంటుందని వెల్లడించారు. రాష్ట్ర కొవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యుడిగా ఉన్న డా.రవి ఓ అసోసియేషన్‌ నిర్వహించిన వెబినార్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుతమున్న టీకాలు కనీసం సంవత్సరం పాటు రక్షణ ఇవ్వగలవు. కొత్త వేరియంట్ల ప్రభావం లేకపోతే రెండు నుండి మూడు సంవత్సరాల వరకు రక్షణగా ఉంటాయి’ అని తెలిపారు. వ్యాక్సిన్ల ప్రభావంపై కచ్చితమైన వ్యవధిని నిర్ణయించేందుకు మరింత పరిశోధన అవసరమన్నారు. 

దేశంలో మూడో దశ అనివార్యమని.. అందుకు సిద్ధంగా ఉండాలని వైరాలజిస్ట్‌ హెచ్చరించారు. కొత్త స్ట్రెయిన్‌లను ముందే గుర్తించాల్సిన అవసముందని నొక్కి చెప్పారు. ‘భారతీయులకు రోగనిరోధక శక్తి అధికమని, భారత్‌లో రెండో దశ రాదని చాలా మంది భావించారు. కానీ దేశంలో రెండో దశ ఎంత విలయం సృష్టింస్తోందో చూస్తున్నాం. దేశంలో మూడో దశ అనివార్యమే. అందుకు అందరూ సిద్ధంగా ఉండాలి. కొన్ని యురోపియన్‌ దేశాల్లో వైరస్‌ మూడో దశ కొనసాగుతోంది. అమెరికా నాలుగో దశ ప్రారంభమైంది’ అని వెల్లడించారు.

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మే మొదటి వారంలో 4 లక్షలకు పైగానే కేసులు నమోదవగా.. దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ విధింపుతో కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,65,553 కొత్త కేసులు నమోదయ్యాయి.  కేసులు తగ్గుముఖం పట్టినా మరణాల్లో మాత్రం అంతగా తగ్గుదల కనిపించడం లేదు. గడిచిన 24 గంటల్లో కరోనాతో 3,460 మంది మృతిచెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని