Published : 27 May 2022 14:16 IST

Karti Chidamabaram: నా రహస్య పత్రాలను సీబీఐ తీసుకెళ్లింది: కార్తీ ఆరోపణలు

లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసిన కాంగ్రెస్‌ ఎంపీ

దిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు సోదాల పేరుతో తనకు చెందిన అత్యంత రహస్య వ్యక్తిగత పత్రాలను స్వాధీనం చేసుకున్నారని కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరం ఆరోపించారు. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి చెందిన పేపర్లను కూడా సీజ్‌ చేసినట్లు తెలిపారు. ఇది పూర్తిగా తన పార్లమెంటరీ హక్కులను ఉల్లంఘించడమేనని ఆరోపిస్తూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు కార్తీ లేఖ రాశారు.

గత కొన్నేళ్లుగా తనను, తన కుటుంబాన్ని ప్రస్తుత ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని కార్తీ దుయ్యబట్టారు. తమ గళాన్ని అణచివేసేందుకు వరుసగా కేసులు పెడుతూ దర్యాప్తు సంస్థలతో తమను వేధిస్తున్నారని మండిపడ్డారు. ‘‘చట్టవిరుద్ధమైన, రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు నేను బాధితుడినయ్యాను. 11 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయంపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. అందులో నా ప్రమేయం లేకపోయినా నాపై కేసు నమోదు చేసి మా ఇంట్లో సోదాలు జరిపింది. ఆ సోదాల్లో సీబీఐ అధికారులు నాకు చెందిన అత్యంత రహస్యమైన, సున్నితమైన వ్యక్తిగత పత్రాలను, పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి చెందిన పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. నా డ్రాఫ్ట్‌ నోట్స్‌తో పాటు కమిటీ సమన్లు జారీ చేసిన సాక్ష్యులను విచారించేందుకు నేను తయారు చేసుకున్న ప్రశ్నాపత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. పార్లమెంట్‌ సభ్యుడిగా నా విధుల్లో జోక్యం చేసుకునేలా సీబీఐ చేపట్టిన ఈ చర్య.. ప్రజాస్వామ్య విధానాలపై ప్రత్యక్ష దాడి లాంటిదే. నా పార్లమెంటరీ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన సీబీఐ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నా’’ కార్తీ లేఖలో స్పీకర్‌ ఓం బిర్లాను అభ్యర్థించారు.

కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కార్తీ.. లంచం తీసుకుని చైనా జాతీయులకు వీసా సదుపాయం కల్పించారన్న ఆరోపణల నేపథ్యంలో ఇటీవల ఆయనపై సీబీఐ కొత్త కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సుమారు రూ.50 లక్షలు తీసుకుని.. చైనాకు చెందిన 250 మందికి కార్తీ చిదంబరం వీసాలు ఇప్పించారన్నది ప్రధాన ఆరోపణ. కార్తీ తండ్రి పి.చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో ఈ వ్యవహారం జరిగిందని సీబీఐ వెల్లడించింది. దీనిపై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. చిదంబరం నివాసంతో పాటు కార్తీ ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు జరిపింది. ఈ కేసులో కార్తీ నేడు సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇదే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కూడా ఆయనపై కేసు నమోదు చేసింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని