JK: కశ్మీర్‌లో మాకు రక్షణ లేదు.. ఎక్కడికైనా తరలించండి: కశ్మీరీ పండిట్ల ఆవేదన

జమ్మూకశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో రాహుల్‌ భట్‌ (35)ను ఉగ్రవాదులు కాల్చి చంపిన తర్వాత అక్కడి కశ్మీరీ పండిట్లలో....

Published : 15 May 2022 01:51 IST

(రాహుల్‌ భట్‌ హత్యకు నిరసనగా కశ్మీరీ పండిట్ల ఆందోళన)

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో రాహుల్‌ భట్‌ (35)ను ఉగ్రవాదులు కాల్చి చంపిన తర్వాత అక్కడి కశ్మీరీ పండిట్లలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కశ్మీర్‌ లోయలో తమకు ఎప్పుడేం జరుగుతుందోనని భయంతో వణుకుతున్నారు. అక్కడి నుంచి తమను సురక్షితంగా వేరే ఎక్కడికైనా తరలించాలని కశ్మీరీ పండిట్‌ వర్గానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు కశ్మీర్‌ ప్రభుత్వాన్ని వేడుకొంటున్నారు. ఈ మేరకు జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హాకు ‘ఆల్‌ పీఎం ప్యాకేజ్‌ ఎంప్లాయీస్‌ ఫోరమ్‌’ పేరుతో ఉద్యోగులు లేఖ రాశారు. తామంతా పీఎం ప్యాకేజీ ఉద్యోగులు, నాన్‌ పీఎం ప్యాకేజీ ఉద్యోగులమని, తమను కశ్మీర్‌ వ్యాలీ నుంచి సురక్షితంగా తరలించి కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ తరలించడం వీలుకాకపోతే మూకుమ్మడిగా రాజీనామా చేసేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామని లేఖలో పేర్కొన్నారు. కశ్మీర్‌లో కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగానే ఉన్నామని తెలిపారు. ఇక్కడ బతకలేకపోతున్నాం.. రోజుల కొద్దీ తమను చంపేస్తున్నారంటూ వాపోయారు.

బుద్గాం జిల్లాలోని గురువారం మధ్యాహ్నం రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్న రాహుల్‌ భట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలైన ఆయన్ను శ్రీనగర్‌లోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మృతిచెందారు. అయితే, ఈ ఘటనకు తమదే బాధ్యత అని కశ్మీర్‌ టైగర్స్‌ అనే ఉగ్రవాద గ్రూపు ప్రకటించుకుంది. రాహుల్‌ భట్‌ మరణించిన తర్వాత ఆ ప్రాంతంలో కశ్మీరీ పండిట్లు నిరసనలకు దిగారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న దాదాపు 350 మంది కశ్మీరీ పండిట్లు ఇటీవల తమ రాజీనామా లేఖలను లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు సమర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని