కశ్మీర్‌ వ్యవహారాన్ని భాజపా హ్యాండిల్‌ చేయలేదు : కేజ్రీవాల్‌

కశ్మీర్‌ అంశాన్ని హ్యాండిల్‌ చేసే శక్తి భారతీయ జనతా పార్టీకి లేదని ఆమ్‌ఆద్మీ పార్టీ చీఫ్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

Published : 06 Jun 2022 01:34 IST

సినిమా ప్రమోషన్లలో భాజపా నేతలు బిజీగా ఉన్నారన్న విపక్షాలు

దిల్లీ: కశ్మీర్‌ అంశాన్ని హ్యాండిల్‌ చేసే శక్తి భారతీయ జనతా పార్టీకి లేదని ఆమ్‌ఆద్మీ పార్టీ చీఫ్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఇటీవల చోటుచేసుకుంటున్న వరుస సంఘటనల కారణంగా కశ్మీరీ పండిట్లు అక్కడ నుంచి బలవంతంగా తరలిపోతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో అటువంటి ఘటనలను ఆపేందుకు ఉన్న ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం బయటపెట్టాలని అరవింద్‌ కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. దిల్లీలోని జంతర్‌ మంతర్‌లో ఏర్పాటు చేసిన ‘జన్‌ ఆక్రోశ్‌ ర్యాలీ’లో పాల్గొన్న కేజ్రీవాల్‌.. కశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలు పెరిగేందుకు పాకిస్థాన్‌ మద్దతు ఇస్తోందంటూ దుయ్యబట్టారు.

‘కుయుక్తులు ఆపాలని పాకిస్థాన్‌కు చెప్పదలచుకున్నా. కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే. కశ్మీర్‌పై రాజకీయం చేయొద్దు’ అని ఆమ్‌ఆద్మీ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. కశ్మీర్‌ అంశాన్ని హ్యాండిల్‌ చేసే శక్తి భారతీయ జనతా పార్టీకి లేదన్నారు. ఈ నేపథ్యంలో భాజపా ప్రభుత్వం ముందు నాలుగు డిమాండ్లను ఉంచారు. ముఖ్యంగా కశ్మీర్‌ వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు కేంద్ర దగ్గర ఉన్న ప్రణాళిక తెలిపాలి. కశ్మీర్‌ బయట పనిచేసే వీలు లేకుండా కశ్మీరీ పండిట్లతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలి. వారి డిమాండ్లను నెరవేర్చడంతోపాటు కశ్మీరీ పండిట్లకు భద్రత కల్పించాలని అరవింద్‌ కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు.

సినిమా ప్రమోషన్లలో భాజపా బిజీ

కశ్మీరీ పండిట్లను ఆదుకునేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఉద్ఘాటించారు. కశ్మీర్‌ లోయలో తాజా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. గతంలో కశ్మీర్‌ పండిట్ల పిల్లలకు చదువుల్లో రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. కశ్మీర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ భాజపా మాత్రం కొన్ని సినిమాలు ప్రమోట్‌ చేసుకోవడంలో బిజీగా ఉందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ విమర్శించారు. వీటి గురించి మాట్లాడాల్సింది పోయి.. శివలింగాలను కనుక్కోవడంలో భాజపా నాయకులు మునిగిపోయారని ఆరోపించారు. మరోవైపు జమ్మూ కశ్మీర్‌లో హిందువులు, కశ్మీరీ పండిట్లకు భద్రత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఎన్‌సీపీ ఆరోపించింది. సినిమా ప్రమోషన్లలో బిజీగా మారిన భాజపా నేతలు.. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పాటుపడుతున్నారని విమర్శలు గుప్పించింది.

గత కొన్ని వారాలుగా కశ్మీర్‌ లోయలో కొనసాగుతోన్న ఉగ్రదాడుల్లో ఇప్పటివరకు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని జరుపుతోన్న దాడులతో కశ్మీరీ పండిట్లు వణికిపోతున్నారు. దీంతో కశ్మీర్‌ నుంచి భారీ స్థాయిలో వలస వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ  నేపథ్యంలో వారికి భరోసా కల్పించడంతోపాటు భద్రత కల్పించాలనే డిమాండ్‌ దేశవ్యాప్తంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ప్రణాళికను బహిర్గతం చేయాలని విపక్షపార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని