Train Accident: ‘కవచ్‌’ ఉంటే బెంగాల్‌ రైలు ప్రమాదం తప్పేదా? ఏంటీ వ్యవస్థ..?

Train Accident: బెంగాల్ రైలు ప్రమాద ఘటనలో సిగ్నలింగ్‌ వైఫల్యం కన్పిస్తోంది. మరోవైపు ఈ మార్గంలో ‘కవచ్‌ (Kavach)’ రక్షణ వ్యవస్థ ఉండి ఉంటే ప్రమాదం తప్పేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటీ వ్యవస్థ..?

Updated : 17 Jun 2024 16:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు వచ్చినప్పుడు ప్రమాదాలు నివారించేందుకు ఏర్పాటు చేసిన రక్షణ వ్యవస్థే ‘కవచ్‌ (Kavach)’. ఈ సాంకేతికత అందుబాటులో ఉండి ఉంటే.. పశ్చిమబెంగాల్‌ (West Bengal)లోని దార్జిలింగ్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం (Train Accident) తప్పేదని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైల్వేకు రక్షణ కవచం లాంటి ఈ వ్యవస్థ ఈ మార్గంలో ఇంకా అందుబాటులోకి రాలేదు. తాజా దుర్ఘటన నేపథ్యంలో ‘కవచ్‌’ మరోసారి చర్చకు వచ్చింది. గతంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ‘కవచ్‌’ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో వివరించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది.

ఏంటీ కవచ్‌ వ్యవస్థ..

రైళ్ల రాకపోకలకు నియంత్రించేందుకు భారత రైల్వే గత కొన్నేళ్లుగా విదేశీ సాంకేతికతపైనే ఆధారపడాల్సి వస్తోంది. అయితే దేశీయంగా టెక్నాలజీని అభివృద్ధి చేసి రైల్వేలో స్వావలంబన సాధించాలని కేంద్రం భావించింది. ఈ క్రమంలోనే రీసర్చ్‌ డిజైన్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్ (RSDO).. మేధా సర్వో డ్రైవ్స్‌, కెర్నెక్స్‌ మైక్రో సిస్టమ్స్‌తో కలిసి ‘ట్రైన్‌ కొలిజన్‌ అవైడెన్స్‌ సిస్టమ్‌ (TCAS)’ అనే సాంకేతికతను అభివృద్ధి చేసింది. దీనిని భారతీయ రైల్వే ఆమోదించింది. దీన్నే ఆటోమెటిక్‌ ట్రైన్‌ ప్రొటెక్షన్‌ (ATP) సిస్టమ్‌, కవచ్‌ (Kavach) గా పిలుస్తున్నారు.

పనిచేస్తుందిలా..

రైల్వేల్లో ‘సున్నా ప్రమాదాలే’ లక్ష్యంగా ఈ కవచ్‌ సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు రైల్వే మంత్రి తెలిపారు. ప్రమాదం ఎదురైనప్పుడు రైలు దానంతటే అదే ఆగిపోయేలా ఈ టెక్నాలజీని రూపొందించారు. ఉదాహరణకు ఒక రైలు వెళ్తోన్న మార్గంలోనే కొంత దూరంలో మరో రైలు కూడా ప్రయాణిస్తున్నప్పుడు.. ఈ ‘కవచ్‌’ టెక్నాలజీ వెంటనే సెన్సర్లతో గుర్తిస్తుంది. దీంతో రైలు ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. రెడ్‌  సిగ్నల్‌ను పట్టించుకోకుండా లోకో పైలట్‌ అలాగే రైలును తీసుకెళుతుంటే.. ఈ వ్యవస్థతో ఆటోమెటిక్‌గా బ్రేకులు పడతాయి. పట్టాలు బాగా లేనప్పుడు, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు రైలును ఆపేస్తుంది. వంతెనలు, మలుపులు ఉన్నచోట  పరిమితికి మించిన వేగంతో రైలును నడుపుతుంటే.. కవచ్‌లోని రక్షణ వ్యవస్థ స్పందిస్తుంది. రైలు వేగాన్ని నిర్దేశిత వేగానికి తగ్గిస్తుంది.

పనిచేయని సిగ్నల్‌ వల్లే..

తాజాగా బెంగాల్‌ రైలు ప్రమాదం ఘటనలో సిగ్నలింగ్‌ వైఫల్యం కన్పించింది. ప్రమాదం జరిగిన రాణిపత్ర రైల్వే స్టేషన్‌, చట్టర్‌ హట్‌ జంక్షన్‌ మధ్య ఆటోమెటిక్‌ సిగ్నలింగ్‌ సస్టమ్ సోమవారం ఉదయం 5.50 గంటల నుంచి పనిచేయలేదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ‘‘ఉదయం 8.27 గంటలకు కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ (Kanchanjungha Express) రంగపాణి స్టేషన్‌ నుంచి బయల్దేరింది. అయితే సిగ్నల్‌ వైఫల్యం కారణంగా రాణిపత్ర, చట్టర్‌ హట్‌ జంక్షన్‌ మధ్యలో ఆగిపోయింది. సాధారణంగా ఇలా ఆటోమెటిక్‌ సిగ్నల్‌ విఫలమైనప్పుడు స్టేషన్‌ మాస్టర్ రైళ్లకు ‘టీఏ 912’ అనే లిఖితపూర్వక అథారిటీని జారీ చేస్తారు. సాంకేతిక లోపం కారణంగా రెడ్‌ సిగ్నళ్లు ఉన్నప్పుడు వాటిని దాటుకుని వెళ్లేందుకు ఇది అనుమతినిస్తుంది. ఎక్స్‌ప్రెస్‌కు కూడా రాణిపత్ర స్టేషన్‌ మాస్టర్‌ ఈ అథారిటీని జారీ చేశారు’’ అని రైల్వే అధికారి ఒకరు చెప్పినట్లు పీటీఐ వెల్లడించింది.

అయితే, అదే సమయంలో రంగపాణి స్టేషన్‌ నుంచి ఓ గూడ్స్‌ రైలు (Goods Train) వేగంగా వచ్చి ఈ ఎక్స్‌ప్రెస్‌ రైలును ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సదరు అధికారి తెలిపారు. అయితే, ఇక్కడ గూడ్స్‌ రైలుకు కూడా ‘టీఏ 912’ జారీ చేశారా? లేదా లోకో పైలట్‌ నిబంధనలను ఉల్లంఘించారా అనేది తెలియాల్సి ఉందని చెప్పారు. దీనిపై దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు. ఒకవేళ, ఈ మార్గంలో ‘కవచ్‌’ వ్యవస్థ ఉండి ఉంటే.. సిగ్నల్‌ దాటుకుని వచ్చినా గూడ్స్‌ రైలు ఆగి ఉండేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ రైల్వే నెట్‌వర్క్‌లోని చాలా ప్రాంతాల్లో అందుబాటులో ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ ఏడాది చివరి నాటికి 3వేల కిలోమీటర్ల ట్రాక్‌లకు కవచ్‌ను తీసుకురావాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో దిల్లీ-హావ్‌డా మార్గం కూడా ఉంది. దీని పరిధిలోకి తాజాగా ప్రమాదం జరిగిన ప్రాంతం కూడా వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని