Sakshi Maharaj: ‘గాజు సీసాలు, బాణాలు ఉంచుకోండి’.. భాజపా ఎంపీ వివాదాస్పద పోస్ట్‌!

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉండే ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన భాజపా ఎంపీ సాక్షి మహరాజ్‌ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు.

Updated : 25 Apr 2022 05:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉండే ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన భాజపా ఎంపీ సాక్షి మహరాజ్‌ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఒక వర్గానికి చెందిన వ్యక్తులు మీ ఇంటిపై ఎప్పుడైనా దాడి చేయొచ్చని, కాబట్టి ఎప్పుడూ ఇంట్లో గాజు సీసాలు, బాణాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆదివారం ఫేస్‌బుక్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు.

‘‘ఒక గుంపు మీ వీధికి లేదా మీ ఇంటికి మీదికి వస్తే దాన్ని అడ్డుకోవడానికి ఓ కొత్త మార్గం ఉంది. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో గాజు సీసాలు, బాణాలు ఉంచుకోండి. ఎందుకంటే పోలీసులు మిమ్మల్ని రక్షించడానికి రారు. ఆ సమయంలో వారు ఏదో షెల్టర్‌లో దాక్కుంటారు. తీరా వారు వచ్చి వెళ్లాక పోలీసులు వస్తారు. కమిటీల పేరు చెప్పి కాలయాపన చెయ్యడంతో ఆ విషయం ముగుస్తుంది. కాబట్టి ప్రజలే తమను తాము రక్షించుకోవాలి’’ అంటూ పోస్ట్‌ చేశారు. కర్రలు, రాళ్లుచేత బూని కొందరు పరుగెడుతున్న ఫొటోను తన పోస్ట్‌కు జత చేశారు. ఓ వర్గం ప్రజలనుద్దేశించి ఈ పోస్ట్‌ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. దిల్లీలోని జహంగీర్‌పురితో పాటు పలు రాష్ట్రాల్లో శ్రీరామ నవమి సందర్భంగా కొన్ని మతపరమైన ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సాక్షి మహరాజ్‌ ఈ పోస్ట్‌చేయడం గమనార్హం. కాగా, 2013లో బంగ్లాదేశ్‌ రాజధాని నగరం ఢాకాలో జరిగిన ఆందోళనలకు సంబంధించిన చిత్రాన్ని సాక్షి మహరాజ్‌ తన పోస్ట్‌కు జతచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని