Kejriwal: సిసోదియాను ఎంతో మిస్‌ అవుతున్నా..: కన్నీరు పెట్టుకున్న కేజ్రీవాల్‌

విద్యారంగాన్ని మెరుగుపర్చేందుకు ఆప్‌ నేత మనీశ్‌ సిసోదియా(Manish Sisodia) ఎంతో కృషి చేశారని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్(Arvind Kejriwal) అన్నారు. అందుకే ఆయన జైలుపాలయ్యారంటూ.. భాజపాపై విమర్శలు గుప్పించారు. 

Published : 07 Jun 2023 16:45 IST

దిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Delhi Chief Minister Arvind Kejriwal) ఉద్విగ్నభరితులయ్యారు. తన సహచరుడు, ఆప్ అగ్రనేత మనీశ్‌ సిసోదియా(Manish Sisodia) తలచుకొని కన్నీరుపెట్టుకున్నారు. దేశ రాజధాని నగరంలో కొత్త పాఠశాల భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది.

బుధవారం బవానా ప్రాంతంలో కేజ్రీవాల్‌(Arvind Kejriwal) బీఆర్ అంబేడ్కర్ స్కూల్‌ ఆఫ్ స్పెషల్‌ ఎక్స్‌లెన్స్‌ కొత్త విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఈ సమయంలో మనీశ్‌ను ఎంతో మిస్‌ అవుతున్నా. ఆయన దీనిని మొదలుపెట్టారు. ప్రతి విద్యార్థి మెరుగైన విద్య పొందాలనేది ఆయన కల. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, మంచి విద్యను అందిస్తున్నందుకు ఆయన్ను జైలుపాలు చేశారు. విద్యారంగంలో దిల్లీ ప్రభుత్వం తీసుకువస్తోన్న విప్లవాత్మక మార్పులు ముగిసిపోవాలని వారు(భాజపా) కోరుకుంటున్నారు. కానీ మేం అలా జరగనివ్వం. తప్పుడు ఆరోపణలు చేసి, తప్పుడు కేసు పెట్టి.. అలాంటి మంచి వ్యక్తిని జైల్లోపెట్టారు. ఎంతోమంది దొంగలు రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతున్నారు. సిసోదియా విద్యారంగాన్ని మెరుగుపర్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోయుంటే.. ఆయన్ను జైల్లో పెట్టేవారు కాదు. ఆయన త్వరలోనే జైలు నుంచి బయటకువస్తారని నేను నమ్ముతున్నాను. ఆయన విడుదలయ్యేవరకు.. పిల్లలకు మంచి విద్యను అందించేందుకు రెట్టింపు కష్టపడాలి’ అని కేజ్రీవాల్ అన్నారు.

ప్రభుత్వ మద్యం విధాన రూపకల్పన, అమలులో అవకతవకలు చోటుచేసుకున్న వ్యవహారంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 26న సీబీఐ (CBI) అధికారులు సిసోదియా (Manish Sisodia)ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ  కేసు (Delhi Excise scam case)లో అరెస్టయి తిహాడ్‌ జైల్లో ఉన్న దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్‌ (AAP) నేత మనీశ్‌ సిసోదియా (Manish Sisodia)కు దిల్లీ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. బెయిల్ ఇచ్చేందుకు సోమవారం కోర్టు నిరాకరించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని