Kejriwal: పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి దిల్లీ సీఎం ఆతిథ్యం

ఇటీవల గుజరాత్‌(Gujarat) పర్యటనలో ‘మా ఇంటికి వస్తారా సార్‌’? అని అడిగిన ఓ ఆటోడ్రైవర్‌ ఇంటికి వెళ్లి భోజనం చేసిన దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌(Kejriwal) ఈసారి దళిత వర్గానికి చెందిన ఓ పారిశుద్ధ్య.....

Published : 27 Sep 2022 01:44 IST

సీఎం కుటుంబంతో కలిసి భోజనం చేసిన హర్ష్‌ సోలంకి కుటుంబ సభ్యులు

దిల్లీ: ఇటీవల గుజరాత్‌(Gujarat) పర్యటనలో ‘మా ఇంటికి వస్తారా సార్‌’? అని అడిగిన ఓ ఆటోడ్రైవర్‌ ఇంటికి వెళ్లి భోజనం చేసిన దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌(Kejriwal) ఈసారి దళిత వర్గానికి చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి తన ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చారు. గుజరాత్‌కు చెందిన పారిశుద్ధ్య కార్మికుడు హర్ష్‌ సోలంకి కుటుంబంతో కలిసి సీఎం భోజనం చేసిన ఆసక్తికర ఘటన సోమవారం దిల్లీలో జరిగింది. నిన్న అహ్మదాబాద్‌ పర్యటన సందర్భంగా ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఆహ్వానం మేరకు హర్ష్‌ సోలంకి తన కుటుంబంతో కలిసి ఈరోజు దిల్లీకి వెళ్లారు. దిల్లీ విమానాశ్రయంలో ఆ కుటుంబానికి ఎంపీ రాఘవ్‌ చద్దా సాదర స్వాగతం పలికారు. అనంతరం దిల్లీలోని ప్రభుత్వ పాఠశాల, ఆస్పత్రులను సందర్శించారు. తన ఇంటికి చేరుకున్న హర్ష్‌ సోలంకిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్న కేజ్రీవాల్‌.. ఆ కుటుంబ సభ్యులతో కలిసి విందు ఆరగించారు. ఈ సందర్భంగా హర్ష్‌ సోలంకి కేజ్రీవాల్‌కు బాబాసాహెబ్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో రాఘవ్‌ చద్దాతో పాటు పలువురు ఆప్‌ నేతలు కూడా ఉన్నారు. ఈ విందుకు సంబంధించిన చిత్రాలను సీఎం తన ట్విటర్‌లో పంచుకున్నారు. హర్ష్‌ సోలంకి కుటుంబానికి తమ ఇంట్లో ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. తమ రెండు కుటుంబాలు కలిసి భోజనం చేశాయని, ఆ కుటుంబాన్ని భగవంతుడు ఆశీర్వదించాలని కోరారు.

(హర్ష్‌ సోలంకి కుటుంబ సభ్యులతో సీఎం కుటుంబం)

ఈ ఏడాది చివరలో జరగనున్న గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు జోరుగా పావులు కదుపుతున్న ఆప్‌.. ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఇటీవలి కాలంలో కేజ్రీవాల్‌ తరచూ పర్యటనలకు వెళ్తూ వివిధ సామాజిక వర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అక్కడి ప్రజల్ని ఆప్‌ వైపు ఆకర్షితుల్ని చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తమను అధికారంలోకి తీసుకొస్తే దిల్లీ తరహా పాలన అందిస్తామంటూ హామీ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం అహ్మదాబాద్‌లో పారిశుద్ధ్యకార్మికులతో ఆప్‌ నిర్వహించిన సమావేశంలో హర్ష్‌ సోలంకిని తన ఇంట్లో విందుకు కేజ్రీవాల్‌ను ఆహ్వానించాడు. ఇప్పటివరకు రాజకీయ నాయకులు దళితుల ఇళ్లకు వెళ్లి భోజనం చేశారని.. కానీ తమ ఇంటికి ఎవరినీ ఆహ్వానించలేదని కేజ్రీవాల్‌ అన్నారు. సోమవారం తన ఇంటికే  హర్ష్‌ సోలంకి తన కుటుంబంతో కలిసి భోజనానికి రావాలని సీఎం ఆహ్వానించారు.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts