
Delhi: త్వరలో ఇంటివద్దే టీకా పంపిణీ!
ఓటు ఉన్న చోటే టీకా పంపిణీ ప్రారంభించిన ఆప్ ప్రభుత్వం
దిల్లీ: వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ వేగవంతం చేసేందుకు దిల్లీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఓటుహక్కు ఉన్న పోలింగ్ కేంద్రం వద్దే స్థానికులకు వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ప్రారంభించింది. త్వరలోనే ఇంటివద్ద వ్యాక్సిన్ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని పేర్కొంది.
‘ఓటు ఉన్న చోటే వ్యాక్సిన్ పంపిణీ’ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు ఉన్న పోలింగ్ కేంద్రానికి వెళ్లాలని పౌరులకు సూచిస్తున్నాం. డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్నీ త్వరలోనే ప్రారంభిస్తాం’ అని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. వచ్చే నాలుగు వారాల్లోనే 45ఏళ్ల వయసుపైబడిన వారందరికీ వ్యాక్సిన్ పంపిణీ పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
ఆంక్షల సడలింపు..
దేశ రాజధానిలో కరోనా ఉద్ధృతి తగ్గిన నేపథ్యంలో నేటినుంచి ఆంక్షల సడలింపు అమలు చేస్తున్నారు. దీంతో షాపింగ్ మాల్స్, మార్కెట్లు, ప్రైవేటు కార్యాలయాలు తెరచుకున్నాయి. వీటిని సరి-బేసి పద్ధతిలో తెరవాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇక మూడు వారాలు పూర్తిగా స్తంభించిపోయిన మెట్రో రైలు సేవలు నేటి నుంచి అందుబాటులోకి వచ్చాయి. వీటితోపాటు ప్రైవేటు కార్యాలయాలు కూడా 50శాతం సామర్థ్యంతోనే నిర్వహించుకునేందుకు వీలు కల్పించింది. ఈ ఆంక్షల సడలింపు జూన్ 14వరకు కొనసాగుతుందని దిల్లీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంచేసింది. మూడో దశను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పీడియాట్రిక్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమయంలో ప్రజలు నిర్వక్ష్యం వహించకుండా కొవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించాలని సూచించారు.