Keralam: కేరళను ‘కేరళం’ అని మార్చండి.. రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం

కేరళ పేరును అధికారికంగా ‘కేరళం’ అని మార్చాలని కేంద్రాన్ని కోరుతూ రూపొందించిన తీర్మానాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

Published : 24 Jun 2024 22:49 IST

తిరువనంతపురం: కేరళ (Kerala) రాష్ట్రం పేరును అధికారికంగా ‘కేరళం’గా (Keralam) మార్చాలని కేంద్రాన్ని కోరుతూ రూపొందించిన తీర్మానాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. వాస్తవానికి గత ఏడాది ఆగస్టులోనే ఈమేరకు తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర హోంశాఖకు పంపించింది. తొలి తీర్మానాన్ని పరిశీలించిన అనంతరం.. అందులో కొన్ని మార్పులు చేపట్టాల్సిందిగా కేంద్ర హోంశాఖ సూచించింది. దీంతో అసెంబ్లీ తాజాగా రెండోసారి తీర్మానాన్ని ఆమోదించింది. పేరు మార్పునకు సంబంధించిన తీర్మానాన్ని సీఎం పినరయి విజయన్‌ (Pinarayi Vijayan) సభలో ప్రవేశపెట్టారు. అధికార ఎల్‌డీఎఫ్‌, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష యూడీఎఫ్ సభ్యులు ఆమోదించారు.

మోదీజీ.. ఆ విషయంలో రాజీపడలేం: మమత

ఈ సందర్భంగా సీఎం విజయన్‌ మాట్లాడుతూ.. కేరళ పేరును అన్ని భాషల్లో ‘కేరళం’ అని మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లోనూ అందుకు అనుగుణంగా మార్పు చేయాలన్నారు. రాష్ట్రం పేరును పూర్వం నుంచే మలయాళంలో ‘కేరళం’ అని పిలిచేవారని గుర్తు చేశారు. మలయాళం మాట్లాడే ప్రజల కోసం ఐక్య కేరళ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ స్వాతంత్ర్య పోరాట కాలం నుంచే ఉందని వివరించారు. ‘‘రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో మా రాష్ట్రం పేరును కేరళ అని రాశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం దానిని ‘కేరళం’గా సవరించాలి. ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని భాషల్లో మార్పులు చేయాలి’’ అని సీఎం పినరయి విజయన్‌ అని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు