Free Vaccination: కేరళ అసెంబ్లీ తీర్మానం

కరోనాతో దేశంలో ఏర్పడిన విపత్కర పరిస్థితుల వేళ అన్ని రాష్ట్రాలకు ఉచితంగా టీకాలు పంపిణీ చేయాలని కేరళ అసెంబ్లీ కేంద్రాన్ని డిమాండ్‌ చేసింది.....

Published : 02 Jun 2021 16:30 IST

తిరువనంతపురం: కరోనాతో దేశంలో ఏర్పడిన విపత్కర పరిస్థితుల వేళ అన్ని రాష్ట్రాలకు ఉచితంగా టీకాలు పంపిణీ చేయాలని కేరళ అసెంబ్లీ కేంద్రాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదంతెలిపారు. వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి వీణా జార్జ్‌ అసెంబ్లీలో బుధవారం తీర్మానం ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం సకాలంలో టీకాలు పంపిణీ చేయాలని కోరారు. కరోనాపై పోరులో భాగంగా అందరికీ ఉచితంగా సార్వత్రిక వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఈ మహమ్మారి నుంచి రక్షణ కల్పించాలని  వీణా జార్జ్‌ కేంద్రాన్ని కోరారు. 

ఓ వైపు ఫస్ట్‌ వేవ్‌ దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచగా.. ప్రస్తుతం దేశం సెకండ్‌ వేవ్‌ ఎదుర్కొంటోందన్నారు. ఈ తరుణంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె కోరారు. తద్వారా ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కరోనాపై పోరాటంలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని, సార్వత్రిక వ్యాక్సినేషన్‌ చేపట్టాలని కోరారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి సీపీఎం నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్‌, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ కూటమి సభ్యులంతా కొద్దిపాటి మార్పులతో ఈ తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని