kerala: 108 మంది పోలీస్‌ అధికారుల్ని డిస్మిస్‌ చేశాం: సీఎం విజయన్‌

నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడిన పోలీస్‌ అధికారులపై కఠిన చర్యలు తీసుకొంటున్నట్లు కేరళ సీఎం పినరయి విజయన్‌ అన్నారు.

Published : 08 Jul 2024 17:19 IST

తిరువనంతపురం: నేర సంబంధిత కార్యకలాపాలకు పాల్పడిన పోలీస్‌ అధికారులపై కేరళ (Kerala) ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని సీఎం పినరయి విజయన్‌ (pinarayi Vijayan) తెలిపారు.  2016 నుంచి 2024 మే 31వరకు 108మంది పోలీస్‌ అధికారుల్ని విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు. నేరపూరిత నేపథ్యం కలిగిన అధికారులపై తీసుకున్న చర్యలకు సంబంధించి అసెంబ్లీలో వచ్చిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ‘2016 నుంచి 2024 మే 31 వరకు 108 మంది పోలీస్‌ అధికారుల్ని డిస్మిస్‌ చేశాం. అవినీతి, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు, మాఫియాతో సంబంధాలకు పాల్పడుతున్న అధికారుల్ని నిశితంగా పరిశీలిస్తున్నాం. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాం’’ అని తెలిపారు. 

మరోవైపు,  రాష్ట్రంలో గూండాలు, మాఫియా హింసలు పెరిగిపోతున్నాయన్న విపక్షాల ఆరోపణలపైనా స్పందించారు. అలాంటి ముఠాలను నిఘా విభాగం నిరంతరం పర్యవేక్షిస్తోందని.. వారిని ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ బృందాన్ని  (ఎస్‌ఏజీఓసీ) ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు.  హోంశాఖను సైతం నిర్వహిస్తున్న సీఎం విజయన్‌.. ఇంటెలిజెన్స్‌ విభాగం అధికారుల పని తీరును ప్రశంసించారు.  రాజకీయ, మతపరమైన దాడులు, బెదిరింపులను గుర్తించి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని..  అలప్పుళ, పాలక్కడ్‌లలో రాజకీయ హత్యలు జరిగిన వెంటనే రాష్ట్రంలో శాంతి వాతావరణం నెలకొల్పేందుకు తగిన చర్యలు చేపట్టారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని