Published : 05 May 2022 01:33 IST

Kerala Couple: భర్త సముద్రంలో హైజాక్‌కు గురై.. భార్య బాంబుల మోతలో చిక్కుకొని..!

కొత్త జంటను కలవరపెట్టిన ప్రపంచ సంక్షోభాలు

ఇంటర్నెట్ డెస్క్: అటు ఉక్రెయిన్ సంక్షోభం.. ఇటు హౌతీల తిరుగుబాటు.. ఓ కొత్త జంట జీవితంలో తీవ్ర అలజడి సృష్టించాయి. ప్రపంచంలో ఎక్కడో ఏర్పడిన ఘర్షణలు కేరళకు చెందిన ఆ దంపతులకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. నాలుగు నెలల పాటు తీవ్ర వేదనకు గురయ్యారు. కేరళకు చెందిన అఖిల్ రఘు(26), జితినా జయకుమార్‌(23)కు గత ఆగస్టులో వివాహం జరిగింది. రఘు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన కార్గో షిప్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటు జితినా.. ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. వివాహం జరిగిన నెల రోజుల తర్వాత ఇద్దరు వారి పనుల్లోకి వెళ్లిపోయారు. పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆ జంటకు మున్ముందు గడ్డు రోజులు రానున్నాయని ఆ సమయంలో ఎవరూ ఊహించలేకపోయారు. 

నౌకను హైజాక్‌ చేసిన హౌతీలు..

జనవరి 2, 2022.. ఎర్రసముద్రంలో ప్రయాణిస్తోన్న ర్వాబీ నౌకలో విధులు నిర్వర్తిస్తోన్న సిబ్బందికి ఒక్కసారి కాల్పుల మోత వినిపించింది. చిన్న పడవలు వేసుకొని దాదాపు 40 మంది వారిని చట్టుముట్టి, నౌకను హైజాక్ చేశారు. రఘుతో పాటు ఏడుగురు భారతీయులు వారికి చేతిలో బందీలుగా మారిపోయారు. యెమెన్‌లో సౌదీ మద్దతుతో నడుస్తోన్న ప్రభుత్వానికి, హౌతీ తిరుగుబాటు దారులకు మధ్య ఏడేళ్లుగా అంతర్యుద్ధం నడుస్తోంది. దాంతో ఆ నౌకలో సౌదీ అరేబియాకు సైనిక సామాగ్రిని తరలిస్తున్నారని అనుమానించి, హౌతీలు దానిని హైజాక్ చేశారు.

నౌకలో ఉన్న 11 మంది సిబ్బందిని యెమెన్‌ రాజధాని సనా దగ్గర్లో హోటల్‌, నౌకలో మార్చి మార్చి ఉంచుతూ 112 రోజుల పాటు బంధించారు. మొదట్లో తిరుగుబాటుదారులు వీరితో కఠినంగా ఉన్నా.. వీరు అమాయకులని గ్రహించిన తర్వాత కాస్త మెతగ్గానే ఉండేవారు. అప్పుడప్పుడు ఇంటికి ఫోన్‌ చేసుకోవడానికి అనుమతించేవారు. అయితే వారున్న హోటల్‌కు 100 మీటర్ల దూరంలో బాంబు దాడి జరగడంతో వీరంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ‘మమ్మల్ని ఎప్పుడు వదిలేస్తారో తెలిసేదికాదు. మేం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నామని అర్థమైంది. మాకు ఏం జరుగుతోందో కూడా అర్థం కాలేదు’ అంటూ బందీల్లో ఒకరైన సంజీవన్ వెల్లడించారు. మరోపక్క రఘు తన భార్య ఉక్రెయిన్‌ సంక్షోభంలో చిక్కుకుపోయిందన్న వార్తను టీవీలో చూసి, తీవ్ర ఆందోళనకు గురయ్యారు.   

ఉక్రెయిన్ సంక్షోభంలోకి జితిన..

పెళ్లి తర్వాత తన చదువును కొనసాగించేందుకు ఉక్రెయిన్ వెళ్లిన జితినకు మొదట్లో అంతా సక్రమంగానే జరిగింది. తర్వాత అకస్మాత్తుగా తన భర్త ఫోన్ తీయకపోయేసరికి ఆమెకు భయం మొదలైంది. ఆయనకు ఏమైందోనని కంగారుపడసాగింది. తన భర్త ఉన్న నౌక హైజాక్‌కు గురైందని తన సోదరుడు ద్వారా తెలుసుకుంది. ఆయన కూడా రఘు పనిచేసే చోటే విధులు నిర్వర్తిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే తన భర్తను తిరిగి తీసుకువచ్చే మార్గాలపై ఆమె దృష్టిసారించారు. భారత ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపారు. ఆ సమయంలో ఆమె స్నేహితులు ఆమెకు అండగా నిలిచారు. ఇలా రోజులు గడుస్తుండగా.. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ మొదలైంది. దాంతో వీరు బంకర్లలో దాక్కొవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు ఆమె తనను తాను రక్షించుకోవాల్సిన పరిస్థితిల్లోకి జారిపోయింది. అయితే భారత ప్రభుత్వం చేపట్టిన తరలింపు ఆపరేషన్‌ ద్వారా కొద్దిరోజులకు ఆమె ఉక్రెయిన్‌ సంక్షోభం నుంచి బయటపడ్డారు. కేరళకు వచ్చి, భర్త కోసం తన ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ విషయంలో జిబౌటీలోని భారత అంబాసిడర్ వీరికి సహకరించారు. బందీలుగా చిక్కిన వారు విడుదలవుతారని, అయితే కొంత సమయం పడుతుందని భరోసా ఇచ్చారు. 

చివరకు ఆమె నమ్మకమే నిజమై..

చివరకు రంజాన్ నెల ప్రారంభం కావడంతో రెండు నెలల సంధికి హౌతీలు అంగీకరించారు. ఒమన్, ఇతర దేశాల సహకారంతో భారత ప్రభుత్వం వారిని విడిపించగలిగింది. తన భర్త ఫోన్ చేసి చెప్పిన తర్వాతే తాను ఆ విషయాన్ని నమ్మానన్నారు జితిన. ‘ఈ సమయంలో నాకు భయంగా అనిపిస్తే..దేవుడిని ప్రార్థించేదాన్ని. నేను ఏడిస్తే.. అప్పటికే ఆందోళనలో ఉన్న మా తల్లిదండ్రులు ఇంకా ఒత్తిడికి గురవుతారనిపించింది. నేనింత ధైర్యంగా ఎలా ఉన్నానో తెలీదు. కానీ ఆయన తిరిగి వస్తారని నా మనసులో గట్టి నమ్మకం ఉండేది. అదే నిజమైంది’ అంటూ తన కుటుంబాలకు ఎదురైన కఠిన పరీక్షల గురించి వెల్లడించారు. చివరకు గతవారం కొచ్చి విమానాశ్రయంలో రఘు దిగడంతో జితినకు ప్రాణం లేచొచ్చినట్లయింది. రఘుతో పాటు ఉన్న ఇతర భారతీయులు కూడా వారి సొంత ప్రాంతాలకు చేరుకున్నారు. ఇది తమకు పునర్జన్మ అంటూ ఉద్వేగానికి గురయ్యారు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని